Begin typing your search above and press return to search.

ఆపరేషన్ బీఆర్ఎస్.. రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఇదేనా?

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంతో ఆపరేషన్ బీఆర్ఎస్ 2.0 స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది.

By:  Tupaki Political Desk   |   13 March 2026 11:00 PM IST
ఆపరేషన్ బీఆర్ఎస్.. రేవంత్ రెడ్డి నెక్ట్స్ టార్గెట్ ఇదేనా?
X

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. పది మంది జంపింగ్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడంతో ఆపరేషన్ బీఆర్ఎస్ 2.0 స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి తెచ్చేలా ప్లాన్ చేశారు. మొత్తం 36 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో 10 మందిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఈ క్రమంలో మరో పది మందిని కూడా ఆ పార్టీ నుంచి బయటకు తీసుకువచ్చి బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని వ్యూహరచన చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలను పసిగట్టిన బీఆర్ఎస్ అందుకు దీటుగా పనిచేసింది. ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇందులో ప్రధానమైనది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు వేయడం, వాటిపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు వేయడం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో పట్టుదలగా ఉండటం వల్ల అప్పట్లో కాంగ్రెస్ వ్యూహాలు పారలేదని చెబుతున్నారు. పది మంది ఎమ్మెల్యేలతోనే ఆపరేషన్ ఆకర్ష్ ముగిసింది. అయితే ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం వెలువడింది.

ఎమ్మెల్యేలు అందరికీ క్లీన్ చిట్ ఇవ్వడంతో త్వరలో మరిన్ని జంపింగ్స్ ను ప్రోత్సహించేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు బీఆర్ఎస్ న్యాయపోరాటం వల్ల అనర్హత వేటు భయంతో కొంత మంది ఎమ్మెల్యేలు గోడదూకేందుకు సాహసించలేదని అంటున్నారు. ఇప్పుడు ఆ భయం లేకపోవడంతో అధికార పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉందనే ప్రచారం జరిగిందని, కానీ ఎన్నికల్లో రికార్డు విజయాలు నమోదు చేయడంతో ప్రభుత్వం వైపు కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారని ప్రచారం ప్రారంభమైందని అంటున్నారు.

బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా తీసివేయాలన్న తన పాత లక్ష్యాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నారని అంటున్నారు. పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసిన నేపథ్యంలో మరికొందరు విపక్ష ఎమ్మెల్యేలతో సంప్రదింపులు మొదలు పెట్టాలని సీఎం భావిస్తున్నారని, ఈ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీలో కొందరు ముఖ్యనేతలకు అప్పగించారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్, వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు చూపలేదని స్పీకర్ భావించడంతో అనర్హత పిటిషన్లు చెల్లలేదంటున్నారు. ఇదే కారణం చూపి భవిష్యత్తులో పార్టీ మారినా తాము కాపాడతామని హామీతో కాంగ్రెస్ నాయకులు ఆపరేషన్ బీఆర్ఎస్ 2.0 స్టార్ట్ చేశారని అంటున్నారు. ఇందులో ఫస్ట్ వికెట్ ఏ ఎమ్మెల్యే అవుతారు? బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుంది? తన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.