‘పాక్ కూడా చేసింది కదా’... మోడీని వెంటాడుతున్న కాంగ్రెస్!
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ.. మోడీ సర్కార్ ని వెంటాడుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 Jun 2025 1:53 AM ISTపహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ.. మోడీ సర్కార్ ని వెంటాడుతోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా పాకిస్థాన్ పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ లో అంగీకరించిన అనంతరం ఈ డిమాండ్ మరింత పెరింది.
అవును... పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ గురించి చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ వరుసగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకు గల ఆవశ్యకతను స్పష్టంగా చెబుతోంది. ఈ సమయంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ డిమాండ్ ను మరోసారి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై (పరోక్షంగా) విమర్శలు గుప్పించారు!
ఆపరేషన్ సిందూర్ విషయంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని ఇప్పటికే ఆరోపించిన ఖర్గే... భారత్ - పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంపై స్పష్టత ఇవ్వడానికి బదులుగా.. సాయుధ దళాల పరాక్రమానికి వ్యక్తిగత క్రెడిట్ తీసుకొని ఎన్నికల మెరుపుదాడిలో ఉన్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ చీఫ్.
ఈ సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడిన ఖర్గే... సాయుధ దళాలకు పూర్తి అధికారం ఇచ్చానని గతంలో చెప్పిన ప్రధాని.. ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నరని ప్రశ్నించారు. ప్రధానమంత్రి స్వీయ ప్రశంసల ప్రసంగాలు చేయకూడదని.. ఒకసారి పార్లమెంటును సమావేశపరిచి మాట్లాడుకుందామని తాము ఇప్పటికే పలుమార్లు చెప్పామని అన్నారు. పాకిస్థాన్ కూడా ఇప్పటికే అలా చేసిందని తెలిపారు.
ఇందులో భాగంగా... ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ కూడా తమ పార్లమెంటును సమావేశపరిచిందని, చర్చలు జరుపుతోందని.. మోడీ కూడా పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచాలని కోరారు. మనలో ఎవరూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడరని ఖర్గే అన్నారు. మొత్తం దేశం మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మోడీ స్వీయ ప్రశంసల ప్రసంగాలు మానుకోవాలని పునరుద్ఘాటించారు!
ఇదే సమయంలో... చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్థావించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే... సింగపూర్ లో సీడీఎస్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వీటిని అడగొచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... దేశం మొత్తాన్ని మోడీ సర్కార్ తప్పుదారి పట్టించిందని ఖర్గే పేర్కొన్నారు!
మరి.. ఇలా పదే పదే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని.. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, సింగపూర్ లో సీడీసీ ఇంటర్వూతో పాటు పలు విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉందని.. పూర్తి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సిన బాద్యత ఉందని కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ కు అనుకూలంగా మోడీ సర్కార్ ఎప్పటికి స్పందిస్తుందనేది వేచి చూడాలి!
