మోడీ ఇలాకాలో కాంగ్రెస్ కీలక భేటీ...సంచలనాలేనా ?
కేంద్రంలో అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కీలక భేటీకి కాంగ్రెస్ రెడీ అవుతోంది.
By: Tupaki Desk | 7 April 2025 1:14 PM ISTకేంద్రంలో అప్రతిహతంగా అధికారంలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కీలక భేటీకి కాంగ్రెస్ రెడీ అవుతోంది. అహ్మదాబాద్ వేదికగా ఏఐసీసీ రెండు రోజుల సమావేశాలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 8,9 తేదీలలో జరిగే ఈ సమావేశాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల ఏఐసీసీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నేతలు హాజరవుతున్నారు
గత ఏడాది డిసెంబర్ లో కర్ణాటకలోని బెలగావిలో కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాలలోనే తదుపరి మీటింగ్స్ ని గుజరాత్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
దేశంలో రాజకీయ వాతావరణం, బీజేపీ దూకుడు వంటి వాటి మీద ఈ భేటీలో చర్చిస్తారు అని అంటున్నారు. అంతే కాదు దేశంలో వరసబెట్టి అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి ఈ ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలు ఉంటే 2026లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళలో ఎన్నికలు ఉన్నాయి. 2027లో గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లలో ఎన్నికలు ఉన్నాయి. 2028లో మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో అసెంబ్లీలకు ఎన్నికలు ఉనాయి ఇక 2029లో కేంద్ర్రంలో ఎన్నికలు ఉన్నాయి.
ఇప్పటి నుంచే ఈ ఎన్నికలకు సంబంధించి రోడ్ మ్యాప్ ని రెడీ చేయడంతో పాటు బీజేపీని ఎలా నిలువరించడం అన్నది చర్చగా ఉంది. అందుబాటులో ఉన్న మిత్రులతో పాటు కొత్త మిత్రులను కూడా వెంట తెచ్చుకుని బీజేపీని ఢీ కొట్టాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. బీజేపీని వీక్ చేయడానికి ప్రాంతీయ పార్టీలతో చేతులు కలపాలని కూడా కాంగ్రెస్ భావిస్తోంది.
జాతీయ విధానంలో భాగంగా వారిని దగ్గరకు తీయాలని చూస్తోంది. అదే సమయంలో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పాత్ర తగ్గకుండా చూసుకోవాలని అనుకుంటోంది. ఈ రోజుకీ ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అందులో 22 పార్టీలతో కలసి పనిచేస్తోంది. రానున్న రోజులలో మరిన్ని పార్టీలను కూడా ఆకర్షించాలని చూస్తోంది.
ఇక 2024 ఎన్నికలో బీజేపీ బలం తగ్గిందని కాంగ్రెస్ భావిస్తోంది. సొంతంగా మెజారిటీ దక్కలేదని మిత్రులతోనే ప్రభుత్వం నడుపుతోందని అంటోంది. ఈ పరిస్థితి మరో నాలుగేళ్ళ నాటికి ఇంకా మారవచ్చునని అపుడు బీజేపీ బలం మరింత తగ్గుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీలు కానీ ఇతర తటస్థ పార్టీలు కానీ బీజేపీ వైపు కంటే తమ వైపే మొగ్గు చూపిస్తున్నాయని కూడా కాంగ్రెస్ లెక్క వేస్తోంది.
దేశంలో లౌకిక వాదం గురించి జనంలో చైతన్యం తేవడంతో పాటు గాంధీ అంబేద్కర్ ఫిలాసఫీని మరింతగా జన బాహుళ్యంలోకి పంపించడం ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకుంటే కనుక కాంగ్రెస్ విజయం తధ్యమని ఏఈఇసీసీ పెద్దలు అంటున్నారు
కాంగ్రెస్ కి పోయిన ఓటు బ్యాంక్ తిరిగి చేరుతోందని ఆ పార్టీ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టిన పార్టీలలో చాలా వరకూ అనేక రాష్ట్రాలలో ఉనికి కోల్పోతున్నాయని అక్కడ గట్టిగా కాంగ్రెస్ నిలబడితే తన పూర్వ వైభవం సంతరించుకోవడం ఏమంత కష్టం కాదని కూడా భావిస్తున్నారు. మొత్తానికి చూస్తే వక్ఫ్ బిల్లు సవరించి చట్టంగా చేసిన తరువాత జరుగుతున్న కాంగ్రెస్ అతి పెద్ద సమావేశం ఇది కావడంతో రాజకీయంగా ఏ రకమైన సంచనాలు ఉంటాయా అన్న చర్చ కూడా సాగుతోంది.
