Begin typing your search above and press return to search.

తెలంగాణ ఐటీ మంత్రిగా అతడికి అవకాశం.. అతనికున్నఅర్హత ఇదే

కాంగ్రెస్ పార్టీని డిజిటలైజేషన్ తో పాటు.. టెక్నాలజీ పరంగా అప్డేట్ చేసిన ఘనత మదన్ మోహన్ దే.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:15 AM GMT
తెలంగాణ ఐటీ మంత్రిగా అతడికి అవకాశం.. అతనికున్నఅర్హత ఇదే
X

మదన్ మోహన్ రావు’ అన్న పేరు చెప్పినంతనే ఎవరు ఇతను? అన్న ప్రశ్న వస్తుంది. అదే.. తాజా ఎన్నికల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యాడని చెబితే.. ఓహో అనేస్తారు. కానీ.. ఇదే వ్యక్తి గురించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొందరిని అడిగితే అతడి గురించి ఆసక్తికర అంశాల్ని చెప్పుకొస్తారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఒక సామాన్య కుటుంబం నుంచి వందల కోట్ల రూపాయిల ఆస్తులు సంపాదించాడంటే.. కచ్ఛితంగా రియల్ ఎస్టేట్ కానీ.. భూములకు సంబంధించిన అంశాలో కారణాలు చెబుతారు. కానీ.. మదన్ మోహన్ రావు లెక్క వేరు. అతనికి ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే అతడికి ఏడు బ్రాంచులు ఉన్నాయి.

రాజకీయాల్లోకి వచ్చి.. దాదాపు రూ.200-300 కోట్ల మధ్య ఖర్చు పెట్టిన అతడు ఒక సామాన్య టీచరు కొడుకు కావటం గమనార్హం. అంతేకాదు.. సర్కారీ స్కూళ్లలో చదువుకొని అంచలంచెలుగా ఎదగటమే కాదు.. ఐటీ కంపెనీని ఏర్పాటు చేసి.. దాన్ని విస్తరించటం.. కొన్ని కంపెనీలుగా ఏర్పాటు చేశారు. డేటా మ్యాపింగ్ సంబంధించిన అంశాల్లో పట్టు ఉన్న అతను.. అలాంటి సేవల్ని అందించే కంపెనీని అమ్మేశారు. మొత్తంగా ఐటీ వ్యవహారం.. ఐటీ కంపెనీలకు సంబంధించిన పట్టుతో పాటు.. కాంగ్రెస్ అధిష్ఠానంలో కీలక నేత రాహుల్ గాంధీకి సుపరిచితుడు.. ఆయన టీంకు చెందిన వ్యక్తి కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.

కాంగ్రెస్ పార్టీని డిజిటలైజేషన్ తో పాటు.. టెక్నాలజీ పరంగా అప్డేట్ చేసిన ఘనత మదన్ మోహన్ దే. రాహుల్ టీంలో ఒకడిగా వ్యవహరిస్తూ.. ఆయనతో కలిసి పని చేసిన అతను కాబోయే తెలంగాణ ఐటీ మంత్రిగా భావిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఐటీకి తెలంగాణకు ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఐటీ మంత్రిగా కేటీఆర్ ఎంతటి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారో తెలిసిందే. ఆయన స్థానాన్ని భర్తీ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి వేళలో.. మదన్ మోహన్ రావు లాంటి వారికి అవకాశం ఇస్తే.. లెక్కలు వేరుగా ఉంటాయని.. ఐటీ ఇండస్ట్రీని మరో మెట్టుకు తీసుకెళ్లేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీ శాఖను ఎవరైనా సీనియర్ కు అప్పజెబితే.. దాన్ని అర్థం చేసుకొని.. అందుకు తగ్గట్లుగా తనను తాను మార్చుకోవటంతోపాటు.. ఆ ఇండస్ట్రీతో కనెక్టు కావటం అంత సులువైన పని కాదు. అదే.. ఆ ఇండస్ట్రీలో అలెడ్రీ ఉన్న వారితో అనుసంధానం చేయటం ఈజీగా ఉంటుంది. అందుకే.. ఐటీ మంత్రిగా మదన్ మోహన్ రావుకు బాధ్యతలు అప్పజెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓడిన అతను.. మంచి వక్త మాత్రమే కాదు.. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్న కసి ఉంది. దీనికి తోడు కొత్త తరం కాంగ్రెస్ కు ప్రతినిధి. ఇలాంటి లక్షణాలన్ని ఉన్న నేపథ్యంలో అతడికి అవకాశం ఇస్తే బాగుటుందన్నమాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. మరి.. రేవంత్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.