Begin typing your search above and press return to search.

అఫిడవిట్ల తిరస్కరణకు కాంగ్రెస్ డిమాండ్

తప్పుడు అఫిడవిట్లను దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలని కాంగ్రెస్ గట్టిగా పట్టుబడుతోంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 5:47 AM GMT
అఫిడవిట్ల తిరస్కరణకు కాంగ్రెస్ డిమాండ్
X

తప్పుడు అఫిడవిట్లను దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించాలని కాంగ్రెస్ గట్టిగా పట్టుబడుతోంది. బీఆర్ఎస్ తరపున నామినేషన్లు దాఖలుచేసిన కొందరు అభ్యర్ధులు అఫిడవిట్లలో తప్పుడు వివరాలను అందించారని, కొన్ని వివరాలను అసలు ఇవ్వలేదని కాంగ్రెస్ అభ్యర్ధులు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు చేయటమే కాకుండా రిటర్నింగ్ అధికారుల దగ్గర పెద్ద వాగ్వాదాలే చేశారు. దాంతో బీఆర్ఎస్ అభ్యర్ధుల నామినేషన్లపై కమీషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం ఇపుడు ఆసక్తిగా మారింది.

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆందోల్ లో క్రాంతికిరణ్, ఆలంపూర్లో విజయుడు, వరంగల్ లో పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్, మేడ్చల్ అభ్యర్ధిగా మంత్రి చామకూర మల్లారెడ్డి తప్పుడు అపిడవిట్లు వేశారని కాంగ్రెస్ అభ్యర్ధులు గట్టి ఆరోపణలు చేశారు. తమ ఆరోపణలకు ఆధారాలను కూడా కాంగ్రెస్ పార్టీ చూపించింది. దాఖలుచేసిన అఫిడవిట్లోని వివరాలు, తాము చూపిస్తున్న ఆధారాల ప్రకారం అభ్యర్ధులు తప్పుడు వివరాలను ఇచ్చినట్లుగా కాంగ్రెస్ అభ్యర్ధులు చాలా స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు.

తప్పుడు అఫిడవిట్లు దాఖలుచేసిన కారణంగా పై అభ్యర్ధుల నామినేషన్లను రెజెక్టు చేయాల్సిందే అని గట్టిగా పట్టుబట్టారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ తప్పుడు ఫార్మాట్లో నామినేషన్ దాఖలుచేసినట్లు తుమ్మల ఆరోపించారు. ఎన్నికల కమీషన్ ఇచ్చిన ఫార్మాట్లో కాకుండా మంత్రి తనిష్టం వచ్చిన ఫార్మాట్లో నామినేషన్ వేసినట్లు చెప్పారు. డిపెండెంట్ కాలమ్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని తుమ్మల మండిపడ్డారు. ఇదే విషయమై మంత్రి మాట్లాడుతు తనపైన డిపెండ్ అయిన వాళ్ళు ఎవరు లేరుకాబట్టే ఆ కాలమ్ ను వదిలేసినట్లు చెప్పారు.

ఆంథోల్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ క్రాంతికిరణ్ అఫిడవిట్లో తన కుటుంబసభ్యుల వివరాలను ఇవ్వలేదని కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేసింది. అలాగే 2021-22 వార్షిక ఆదాయాన్ని జీరోగా చూపించినట్లు మండిపోయింది. ఎంఎల్ఏగా అందుకున్న జీతాన్ని ఎందుకు చూపించలేదని నిలదీసింది. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కూడా దాస్యం తప్పుడు వివరాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఇక మంత్రి మల్లారెడ్డి ఇంటర్మీడియట్ ను మూడు కాలేజీల్లో చదివినిట్లు చెప్పారని కాంగ్రెస్ ఆరోపించింది.

2014లో ఎంపీగా పోటీచేసినపుడు 1973లో తాను ఇంటర్మీడియట్ ను ప్యాట్నీలోని గవర్నమెంట్ కాలేజీలో చదివినట్లు చెప్పారట. 2018లో బీఆర్ఎస్ తరపున పోటీచేసినపుడు ఇంటర్మీడియట్ ను సికింద్రాబాద్ లోని వెస్లీ జూనియర్ కాలేజీలో చదివినట్లు చెప్పారని, తాజా అఫిడవిట్లో లక్ష్మీదేవి గవర్నమెంటు కాలేజీలో ఇంటర్మీడియట్ చదివినట్లు చెప్పారని కాంగ్రెస్ ఆరోపించింది. అఫిడవిట్లలోని తప్పులే ఒక్కోసారి అభ్యర్ధుల తలరాతలను మార్చేస్తుందనటంలో సందేహంలేదు.