చర్చి ప్రాంగణంలో ఘాతుకం... కాల్పుల్లో 21 మంది మృతి!
అవును... కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఆదివారం ఓ చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో సుమారు 21 మంది మృతి చెందారు.
By: Tupaki Desk | 28 July 2025 12:53 AM ISTప్రపంచ వ్యాప్తంగా ప్రశాంతత కరువవుతుందనే కామెంట్లు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క వరుస యుద్ధాలు, సరిహద్దు దేశాల మధ్య ఘర్షణలు, మరోవైపు పెరిగిపోతున్న ఉగ్రమూకలు, రెచ్చిపోతున్న తిరుగుబాటుదారులు... వెరసి అశాంతి విపరీతంగా వ్యాపించడానికి కారణాలుగా మారుతున్న పరిస్థితి. ఈ సమయంలో ఆదివారం ఓ చర్చ ప్రాంగణంలో కాల్పులు జరిగాయి.
అవును... కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఆదివారం ఓ చర్చి ప్రాంగణంలో జరిపిన దాడుల్లో సుమారు 21 మంది మృతి చెందారు. తూర్పు కాంగో కోమాండాలోని ఓ క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) సభ్యులు తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అనేక ఇళ్లు, షాపులు కూడా ధ్వంసమయ్యాయి.
ఈ సందర్భంగా స్పందించిన పౌర సమాజ సమన్వయకర్త డైయుడోన్ దురంతబో... సాయుధ తిరుగుబాటుదారులు సుమారు 21 మందిని కాల్చిచంపారని.. అందులో మూడు మృతదేహాలు కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయని.. అనేక ఇళ్లు, దుకాణాలు దహనమయ్యాయని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇదే సమయంలో... ఈ ఘటన అత్యంత దారుణమని దురంతబో తెలిపారు. భద్రతా అధికారులు అంతా ఉన్న పట్టణంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం నమ్మశక్యంగా లేదని.. ఈ పరిణామల నేపథ్యంలో ఎంతోమంది పౌరులు ఆ ప్రాంతం నుండి పారిపోవడం ప్రారంభించి బునియా వైపు వెళ్తున్నారని అన్నారు. మరోవైపు ఈ దాడులను కాంగో సైనిక ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు.
కాగా... ఇస్లామిక్ స్టేట్ తో ముడిపడి ఉన్న అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ తిరుగుబాటు సంస్థ.. ఉగాండా, కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సామాన్య ప్రజలే లక్ష్యంగా అనేక సంవత్సరాలుగా దాడులకు పాల్పడుతోంది. ఈ విధంగా... 2013 నుంచి ఇప్పటివరకు సుమారు 6,000 మందిని వీరు బలిగొన్నట్లు నివేదికలు ఉన్నాయి.
