విమానంలో 273 మంది.. గాల్లోనే పేలిన ఇంజిన్.. వీడియో వైరల్!
ఇటీవల పలు విమానాల్లో ఎదురైన ఆందోళనకర ఘటనల నేపథ్యంలో మరో అత్యంత షాకింగ్ సంఘటన తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 18 Aug 2025 3:16 PM ISTఇటీవల పలు విమానాల్లో ఎదురైన ఆందోళనకర ఘటనల నేపథ్యంలో మరో అత్యంత షాకింగ్ సంఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. సుమారు 1,500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 273 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
అవును... గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న కాండోర్ ఎయిర్ లైన్స్ విమానం బోయింగ్ 757-300 ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం గాల్లో ఉండగా కుడివైపు ఇంజిన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పెద్ద శబ్దం వినిపించింది. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానం గ్రీస్ లోని కోర్ఫు ద్వీపం మీదుగా వెళ్తుంది.
ఆ సమయంలో ఇది గమనించిన పర్యాటకులు, స్థానికులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. అయితే... విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించారు. ఇందులో భాగంగా... తొలుత ఇంజిన్ లో మంటలు ఆపడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ మంటలు కొనసాగాయి.
ఈ సమయంలో చాకచక్యంగా ఆలోచించిన పైలట్లు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... కోర్ఫుకు తిరిగి వెళ్లే బదులు, ఇటలీలోని బ్రిండీసీ లో అత్యవసరంగా ల్యాండ్ చేయాలని నిర్ణయించారు. ఈ సమయంలో ఒక ఇంజిన్ తోనే విమానాన్ని 8,000 అడుగుల ఎత్తుకు తీసుకొచ్చి, బ్రిండీసీ వైపు మళ్లించారు. సేఫ్ గా ల్యాండ్ చేశారు.
దీంతో అత్యంత పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఈ సందర్భంగా పైలెట్ల సమయస్ఫూర్తిని అంతా అభినందించారు. ఈ సమయంలో స్పందించిన కాండర్ ఎయిర్ లైన్స్... ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. మరుసటి రోజు ప్రయాణికులు జర్మనీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది.
శనివారం సాయంత్రం (ఆగస్టు 16)న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటల ప్రాంతంలో కోర్ఫు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది.
