Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ సీట్ల‌కు పోటా పోటీ.. టీ-కాంగ్రెస్ గ‌రంగ‌రం

అదే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి. పార్టీ అధికారంలోకి రావ‌డంతో స‌భ‌లో సీట్ల సంఖ్య దామాషా ప్ర‌కారం.. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఈ పార్టీకి ద‌క్క‌నున్నాయి.

By:  Tupaki Desk   |   6 Dec 2023 12:27 PM GMT
ఎమ్మెల్సీ సీట్ల‌కు పోటా పోటీ.. టీ-కాంగ్రెస్ గ‌రంగ‌రం
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మ‌రో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఇప్ప‌టికే సుదీర్ఘంగా రెండు మూడు మాసాల పాటు అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌.. మొత్తానికి పార్టీని గెలిపించుకుని.. అధికారంలోకి వ‌చ్చింది. అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి స‌మ‌సిపోయింది. అయితే.. ఇప్పుడు మ‌రో వేడి రాజుకుంది. అదే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి. పార్టీ అధికారంలోకి రావ‌డంతో స‌భ‌లో సీట్ల సంఖ్య దామాషా ప్ర‌కారం.. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఈ పార్టీకి ద‌క్క‌నున్నాయి.

గ‌వ‌ర్న‌ర్ కోటాలో 2, ఎమ్మెల్యే కోటాలో 2 ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయి. మ‌రోవైపు, బీఆర్ ఎస్ ప‌ల్లారాజేశ్వ‌ర్‌రెడ్డి, కూచుకుళ్ల దామోద‌ర్‌రెడ్డి రాజీనామాలు చేస్తే.. స్థానిక సంస్థ‌ల కోటాలో మ‌రో 2 ఎమ్మెల్సీ ప‌ద‌వులు కూడా కాంగ్రెస్‌కే ద‌క్క‌నున్నాయి. అంటే మొత్తంగా ఆరు స్తానాలు కాంగ్రెస్ ప‌రం కానున్నాయి. కానీ, ఈ ఆరు స్తానాల‌కు రెట్టింపు మంది నాయ‌కులు పోటీలో ఉన్నారు. వీరిలో అంద‌రూ సీనియ‌ర్లు కావ‌డం.. ఒక‌రిద్ద‌రు ఫైర్ బ్రాండ్లు కూడా కావ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. మైనారిటీ, బీసీ, రెడ్డి వంటి సామాజిక వ‌ర్గాల డామినేష‌న్ కూడా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌.. మైనారిటీ నాయ‌కుడు ష‌బ్బీర్ అలీ, అద్దంకి ద‌యాక‌ర్‌, వేణుగోపాల్‌, జ‌గ్గారెడ్డి, చిన్నారెడ్డి, సంప‌త్‌కుమార్‌, బ‌ల‌రాం నాయ‌క్‌.. ఇలా అనేక మంది నాయ‌కులు పోటీలో ఉన్నారు. వీరిలో ఒక‌రిద్ద‌రు.. ఎమ్మెల్సీ అయి.. మంత్రుల‌వ్వాల‌నే ప‌ట్టుద‌ల‌తోనూ ఉన్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి మండ‌లి పీఠం ద‌క్కుతుందో చూడాలి.