Begin typing your search above and press return to search.

2 నిమిషాల్లో 200 ఉద్యోగాలు ఫ‌ట్‌!.. ఉద్యోగుల కొంప‌ముంచిన సంస్థ‌

అగ్ర‌రాజ్యం అమెరికాలో 2017లో స్థాపించిన స్టార్ట‌ప్ టెక్ కంపెనీ ఫ్రంట్‌డెస్క్ సంస్థ తాజాగా 200 మంది ఉద్యోగుల‌ను ఉన్న‌ప‌ళాన ఇంటికి పంపేసింది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 3:46 AM GMT
2 నిమిషాల్లో 200 ఉద్యోగాలు ఫ‌ట్‌!.. ఉద్యోగుల కొంప‌ముంచిన సంస్థ‌
X

2 నిమిషాలు.. సాధార‌ణంగా దీనిని పెద్ద లెక్క‌లోకి తీసుకోం. ఆ ఏముందిలే అనుకుంటాం. కానీ, ఓ సంస్థ కేవలం రెండంటే రెండు నిమిషాల్లో 200 మంది ఉద్యోగుల‌ను వారి విధుల నుంచి తొల‌గించేసింది. అది కూడా.. కేవలం వీడియో కాల్‌లో జ‌రిగిపోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో స‌ద‌రు ఉద్యోగులు.. ఇప్పుడు ల‌బోదిబో మంటున్నారు. ఆ రెండు నిమిషాలు.. అస‌లు జ‌రిగాయా? తాము విన్న‌ది నిజ‌మేనా? త‌మ ఉద్యోగాలు పోయింది వాస్త‌వ‌మేనా? అని ఒక‌రినొక‌రు గిల్లుకుని మ‌రీ నిర్ధారించుకుని క‌న్నీటి ప‌ర్యంత మ‌వుతున్నారు.

ఎక్క‌డ‌? ఏ సంస్థ‌?

అగ్ర‌రాజ్యం అమెరికాలో 2017లో స్థాపించిన స్టార్ట‌ప్ టెక్ కంపెనీ ఫ్రంట్‌డెస్క్ సంస్థ తాజాగా 200 మంది ఉద్యోగుల‌ను ఉన్న‌ప‌ళాన ఇంటికి పంపేసింది. వాస్త‌వానికి దేశ‌ వ్యాప్తంగా 1000కు పైగా ఫ‌ర్నిష్డ్ అపార్ట్‌మెంట్లను ఈ సంస్థ‌ నిర్వహిస్తోంది. మార్కెట్‌ రేట్లకు అపార్ట్‌మెంట్లను లీజుకు తీసుకుని టెంప‌ర‌రీగా అద్దెకు ఇస్తుంది. జెట్‌ బ్లూ వెంచర్స్‌, వెరిటాస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వంటి పెట్టుడిదారుల నుంచి సుమారు 26 మిలియన్‌ డాలర్లను సేకరించింది. అయితే.. ఆర్థిక మాద్యం, ప్ర‌పంచ దేశాల్లో యుద్ధం కార‌ణంగా ఇటీవ‌ల లావాదేవీలు మంద‌గించి.. కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ క్ర‌మంలో తాజాగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 2 నిమిషాల వర్చువల్‌ కాల్‌లో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫుల్‌టైమ్‌ ఉద్యోగులు, పార్ట్‌ టైమ్‌ వర్కర్లు, కాంట్రాక్టర్లు.. ఇలా మొత్తం 200 మందిని కంపెనీ తొలగించింది. గూగు ల్‌ మీట్‌ కాల్‌లో ఫ్రంట్‌డెస్క్ సీఈఓ జెస్సీ డిపింటో మాట్లాడుతూ.. సంస్థ ఆర్థిక ఇబ్బందుల గురించి ఉద్యోగులకు వివ‌రించారు.

ఫ్రంట్‌డెస్క్‌ ప్రస్తుతం అద్దె చెల్లింపుల వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. దివాలా ప్రక్రియకు ప్రత్యామ్నాయమైన స్టేట్ రిసీవర్ షిప్ కోసం దరఖాస్తు చేయనున్నట్లు ఉద్యోగుల‌కు ఆయన వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో సంస్థ కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. కేవలం రెండు నిమిషాల్లోనే ఏకంగా 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపారు. ఆయ‌న కాల్ క‌ట్ చేయ‌గానే.. సంబంధిత ఉద్యోగుల ఫోన్ల‌కు `టెర్మినేష‌న్‌` మెసేజ్‌లు వ‌చ్చేశాయి. దీంతో వారంతా.. అస‌లు ఇది జ‌రిగిందా? అని ఆశ్చ‌ర్య‌పోవ‌డంతోపాటు ఉద్యోగాలు పోయిన దుఖంలో క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.