Begin typing your search above and press return to search.

క‌మ్యూనిస్టులను క‌డు ద‌య‌నీయ స్థితిలో నెట్టిన కాంగ్రెస్‌

కొన్ని సిద్ధాంతాలు ఏర్ప‌ర‌చుకొని వివిధ వ‌ర్గాల గొంతుక వినిపించే వేదిక‌లుగా గుర్తింపు పొందిన క‌మ్యూనిస్టు పార్టీలు... ఇటీవ‌లి కాలంలో దుర‌దృష్ట‌వ‌శాత్తు ప్ర‌జాద‌ర‌ణ కోల్పోతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Nov 2023 2:22 AM GMT
క‌మ్యూనిస్టులను క‌డు ద‌య‌నీయ స్థితిలో నెట్టిన కాంగ్రెస్‌
X

కొన్ని సిద్ధాంతాలు ఏర్ప‌ర‌చుకొని వివిధ వ‌ర్గాల గొంతుక వినిపించే వేదిక‌లుగా గుర్తింపు పొందిన క‌మ్యూనిస్టు పార్టీలు... ఇటీవ‌లి కాలంలో దుర‌దృష్ట‌వ‌శాత్తు ప్ర‌జాద‌ర‌ణ కోల్పోతున్నాయి. విశ్లేష‌కుల వాద‌న ప్ర‌కారం ఇటు క‌మ్యూనిస్టుల వైఖ‌రి ఎంత కార‌ణ‌మో అటు ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల్లో మార్పు అంతే కార‌ణం అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాజ‌కీయంగా వామ‌ప‌క్షాల బ‌లం వేగంగా త‌గ్గిపోతోంది. తాజాగా ఈ విష‌యం తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తేటతెల్లం అయిపోయింది. ఆ పార్టీకి టికెట్లు కేటాయిస్తార‌నే ఆశ‌ల్లో చివ‌రి వ‌ర‌కు ఉంచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌... వారి ఊసెత్త‌కుండా సొంతంగా త‌మ పార్టీ క్యాండిడేట్ల‌ను ప్ర‌క‌టించారు. అనంత‌రం ఆ పార్టీల‌ ప‌రిస్థితి మ‌రింత న‌వ్వుల పాల‌యింద‌ని అంటున్నారు.

అధికార బీఆర్ఎస్ పార్టీ త‌మ‌ను తీవ్రంగా ద్రోహం చేసింద‌ని పేర్కొంటూ వామ‌ప‌క్ష పార్టీల ముఖ్య నేత‌లు వాపోయారు. దీంతో స‌హ‌జ మిత్ర‌ప‌క్ష‌మైన కాంగ్రెస్ వైపు చూశారు. అయితే ఆ పార్టీ ఇదిగో అదిగో అంటూ పొత్తులు దాట‌వేసింది.అనంత‌రం ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీట్లు ఇస్తామ‌ని లీకులు ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో త‌మ సొంత నాయ‌కుల పేర్ల‌ను అనౌన్స్ చేసేసింది. దీంతో షాక్ తిన‌డం ఎర్ర పార్టీల నేత‌ల వంత‌యింది. స‌రే ఇచ్చిన చోట్ల‌యినా పోటీ చేద్దామంటే అక్క‌డ ఈ పార్టీల‌కు బ‌లం లేదు. పైగా కాంగ్రెస్ నేత‌ల స‌హాయ నిరాక‌ర‌ణ ఎలాగూ ఉండ‌నే ఉంది. దీంతో వామ‌పక్షాల పార్టీల నేత‌లు ఏం చేయాల పాలుపోని స్థితిలో ఉండిపోయారు.

తాజాగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. రాజకీయ ప్రత్యామ్నాయ నిర్మాణంలో భాగంగా ఇతర లౌకిక, వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలను కలుపుకొని పని చేయడంపై కాంగ్రెస్ ఆలోచన చేయాలని అన్నారు. పరస్పర విశ్వాసం, సర్దుబాటుతో పని చేయడం లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు అలవరుచుకోవాలని సూచించారు. దేశాన్ని రక్షించాలంటే మితవాద, ఫాసిస్టు బీజేపీ, దాని మిత్ర పక్షాలను ఓడించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందని ఆ పార్టీని ఓడించేందుకు రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు వామపక్షాలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.