Begin typing your search above and press return to search.

అలీ ఇప్పుడేం చేస్తారు?

ఈ నేపథ్యంలో అలీ నంద్యాలను ఎంచుకున్నారని కూడా చెప్పుకున్నారు. తీరా చూస్తే అలీకి అసెంబ్లీకి కానీ, పార్లమెంటుకు కానీ పోటీ చేసే చాన్స్‌ దక్కలేదు.

By:  Tupaki Desk   |   5 April 2024 4:01 AM GMT
అలీ ఇప్పుడేం చేస్తారు?
X

ఆంధప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రస్తుతం జగన్‌ నిర్వహిస్తున్నారు. ఇది పూర్తయ్యాక హెలికాప్టర్‌ లో రోజుకు మూడు బహిరంగ సభల్లో పాల్గొనేలా కసరత్తు చేస్తున్నారు. కాగా ఇప్పటికే పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

ఈ క్రమంలో ప్రముఖ హాస్య నటుడు అలీకి చుక్కెదురు అయ్యింది. ఎక్కడా ఆయనకు సీటు దక్కలేదు. అలీని ముస్లింలు ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దింపొచ్చని మొదట వార్తలు వచ్చాయి. ఈ మేరకు అలీకి జగన్‌ సీటు ఖరారు చేశారని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించడమే తరువాయి అని ఇటీవల వరకు వార్తలు వచ్చాయి. కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు స్థానాలను ఎంపిక చేసుకోవాలని అలీకి జగన్‌ ఆఫర్‌ ఇచ్చారని టాక్‌ నడిచింది. ఈ నేపథ్యంలో అలీ నంద్యాలను ఎంచుకున్నారని కూడా చెప్పుకున్నారు. తీరా చూస్తే అలీకి అసెంబ్లీకి కానీ, పార్లమెంటుకు కానీ పోటీ చేసే చాన్స్‌ దక్కలేదు.

కాగా గత ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈ క్రమంలో అలీ తన సొంత ఊరైన రాజమండ్రి నుంచి టికెట్‌ ఆశించారు. అక్కడి నుంచి కాకపోయినా ముస్లింలు ఎక్కువగా ఉన్న గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు.

అయితే అలీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అలీకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. మూడున్నరేళ్లు ఖాళీగానే ఉండిపోయారు. ఇక 2021 చివరలో ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా నియమించారు. అలీ కూడా ఆ పదవిలో సర్దుకుపోయారు.

కాగా అలీ ఇటీవల వరకు వైసీపీ తరఫున సామాజిక సాధికార బస్సు యాత్రల్లో పాల్గొన్నారు. ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని కూడా అలీ చెప్పారు. ఈ నేపథ్యంలో అలీని కర్నూలు పార్లమెంటరీ స్థానం నుంచి జగన్‌ బరిలోకి దింపడానికి నిర్ణయించారని టాక్‌ నడిచింది.

గత ఎన్నికల్లో సీటు ఇవ్వనప్పటికీ, మంచి గుర్తింపు పొందిన పదవి ఇవ్వనప్పటికీ అలీ పార్టీ పట్ల విధేయతతో ఉన్నారు. అయినప్పటికీ అలీకి సీటు దక్కలేదు. ఈ నేపథ్యంలో అలీ కూడా వైసీపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎక్కడా ప్రచారంలో కనిపించడం లేదు. ఆయన హైదరాబాద్‌ కే పరిమితమయ్యారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో కొనసాగుతారో, లేదో తేలాల్సి ఉంది.