Begin typing your search above and press return to search.

డెలివరీ బాయ్ వేషంలో వచ్చి .. ఇన్ఫ్లుయెన్సర్ ను కాల్చిచంపి.. వైరల్ వీడియో

కొలంబియాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ పొందిన యువతి మరియా జోస్ (22) దారుణ హత్యకు గురైంది.

By:  Tupaki Desk   |   19 May 2025 3:00 PM IST
డెలివరీ బాయ్ వేషంలో వచ్చి .. ఇన్ఫ్లుయెన్సర్ ను కాల్చిచంపి.. వైరల్ వీడియో
X

కొలంబియాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ పొందిన యువతి మరియా జోస్ (22) దారుణ హత్యకు గురైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కాల్చి చంపాడు. ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మరియా ఇంటికి వచ్చిన ఓ ఆగంతకుడు డెలివరీ బాయ్ తరహాలో ఉన్నాడు. ఆమె తలుపు తీసే సమయాననే తుపాకీతో మూడు సార్లు కాల్చి పారిపోయాడు. ఈ ఘటన ఆమె ఇంటి బయట సీసీటీవీలో స్పష్టంగా రికార్డయింది. తీవ్రంగా గాయపడిన మరియాను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

ఈ హత్య వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మరియా జోస్ వ్యక్తిగత జీవితం, ఇటీవలి వివాదాలపై ఆరా తీస్తున్నారు. ఇటీవలే మరియా తన మాజీ ప్రియుడిపై గృహ హింస కేసు పెట్టి న్యాయపరంగా విజయం సాధించారు. న్యాయస్థానం అతనిని పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పోలీసులు మొదట అనుమానాస్పదుడిగా మరియా మాజీ ప్రియుడిపై దృష్టి పెట్టి విచారణ చేపట్టారు. అతడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంతకుముందు కూడా ఇలాంటి ఘోరమైన సంఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. అక్కడ టిక్‌టాక్ స్టార్ వలేరియాను లైవ్ స్ట్రీమ్ సందర్భంగా ఓ వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనలు సోషల్ మీడియా సెలబ్రిటీల భద్రతపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆన్‌లైన్ ప్రపంచంలో ప్రజాదరణ పొందిన వ్యక్తులు వాస్తవ జీవితంలో ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారో ఈ సంఘటనలు కళ్లకు కట్టాయి.

సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. సోషల్ మీడియా ప్రముఖుల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దారుణ హత్యపై కొలంబియాలో భద్రతా లోపాలపై చర్చ జరుగుతోంది.