Begin typing your search above and press return to search.

125 మందితో ప్రయాణిస్తున్న సైనిక విమానం కుప్పకూలింది.. అసలేం జరిగింది?

ప్రస్తుతం కొలంబియా ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

By:  A.N.Kumar   |   24 March 2026 10:25 AM IST
125 మందితో ప్రయాణిస్తున్న సైనిక విమానం కుప్పకూలింది.. అసలేం జరిగింది?
X

దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో సోమవారం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. సైనిక సిబ్బందిని తరలిస్తున్న భారీ మిలిటరీ కార్గో విమానం కుప్పకూలిన ఘటనలో కనీసం 100 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెజాన్ అడవుల సమీపంలో జరిగిన ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. విమానంలో ఉన్న భారీ సంఖ్యలోని ప్రయాణికులు, అందులోని పేలుడు పదార్థాల వల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదం ఎలా జరిగింది?

సోమవారం ఉదయం దక్షిణ కొలంబియాలోని అమెజాన్ అటవీ ప్రాంతంలో పెరూ సరిహద్దుకు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. అమెరికా తయారీ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ కు చెందిన సీ-130 హెర్క్యూలస్ మోడల్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదుపుతప్పి నేలకూలింది. విమానంలో మొత్తం 125 మంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. వీరిలో 114 మంది ప్రధానంగా సైనిక దళాలు.. సిబ్బంది 11 మంది ఉన్నారు.

రన్‌వే నుండి బయలుదేరిన కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే విమానం ఒక్కసారిగా కూలిపోయింది. విమానం భూమిని ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగడమే కాకుండా అందులో ఉన్న భారీ పరిమాణంలోని గోళీలు, పేలుడు పదార్థాలు పేలిపోయాయి. ఈ వరుస పేలుళ్ల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలగడమే కాకుండా మరణాల సంఖ్య పెరగడానికి కారణమైందని ప్రాథమిక సమాచారం.

రక్షణ శాఖ స్పందన

ఈ ఘోర ప్రమాదంపై కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఎలాంటి ఉగ్రవాద కుట్ర గానీ క్రిమినల్ గ్యాంగ్‌ల ప్రమేయం గానీ ఉన్నట్లు ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. విమానం కూలిపోవడానికి సాంకేతిక లోపం ప్రధాన కారణం కావచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. "ఇది దేశానికి తీరని లోటు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడమే మా మొదటి ప్రాధాన్యత" అని సాంచెజ్ పేర్కొన్నారు.

సహాయక చర్యలు.. గాలింపు

ప్రమాదం జరిగిన వెంటనే సైన్యం, అత్యవసర విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ తీవ్రంగా గాయపడిన పలువురు సైనికులను హెలికాప్టర్ల ద్వారా రాజధాని బొగెటాకు తరలించారు. ప్రస్తుతం పలువురు సైనికులు ఇంకా అదృశ్యంగానే ఉన్నారు. విమానం శకలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో శోధన కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెరుగుతున్న ఆందోళనలు

కొలంబియాలో గడిచిన మూడు నెలల కాలంలో ఇది రెండో అతిపెద్ద విమాన ప్రమాదం. సాధారణంగా అత్యంత సురక్షితమైనవిగా ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల సామర్థ్యం ఉన్నవిగా పేరుగాంచిన 'సి-130 హర్క్యూలిస్' విమానం ఇలా కూలిపోవడం రక్షణ రంగ నిపుణులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటనతో దేశంలోని మిలిటరీ విమానాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై మళ్లీ చర్చ మొదలైంది.

ప్రస్తుతం కొలంబియా ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తే తప్ప టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానం ఎందుకు కూలిపోయిందనే అంశంపై స్పష్టత రాదు.