బొద్దింక పార్టీ సంచలనం.. బీజేపీని అధిగమించిన కాక్రోక్ జనతా పార్టీ!
దేశంలోని తాజా రాజకీయ పరిణామాలను విమర్శిస్తూ ఆన్ లైన్ వేదికగా ఈ నెల 16న ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది.
By: Tupaki Political Desk | 21 May 2026 12:56 PM ISTదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా బీజేపీకి రికార్డు ఉంది. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో జయకేతనం ఎగరవేస్తూ 2014 నుంచి కేంద్రంలో జైత్రయాత్ర సాగించడమే కాకుండా, దేశంలోని నాలుగు వైపులా విస్తరిస్తూ ఒక్కోరాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి.. తాజాగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ (బొద్దింక పార్టీ) షాకిచ్చింది. ఆన్ లైన్ లో బీజేపీని వెనక్కినెట్టి ఎక్కువ ఫాలోవర్లను సాధించింది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఘనత సాధించిన రికార్డును కూడా కాక్రోచ్ పార్టీ సొంతం చేసుకుంది.
దేశంలోని తాజా రాజకీయ పరిణామాలను విమర్శిస్తూ ఆన్ లైన్ వేదికగా ఈ నెల 16న ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఎక్స్, ఇనస్టా వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో ప్రత్యేక పేజీలను తెరిచి తన పార్టీలో చేరాలని, తన పార్టీ యువత కోసం పనిచేస్తుందని, ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీయటానికి పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. ఇక తన పార్టీలో చేరడానికి కొన్ని అర్హతలు ఉండాలని నిర్దేశించాడు. నిరుద్యోగం, సోమరితనం (భౌతికంగానే మానసికంగా కాదు) ఆన్ లైన్ కు (ఫోన్, సోషల్ మీడియా)కు అతుక్కుని ఉండటం. వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా వెల్లగక్కే నైపుణ్యం ఉండాలని షరతులు పెట్టాడు. ఇవన్నీ యువతను విశేషంగా ఆకర్షిస్తుండటంతో ఆన్ లైనులో కాక్రోచ్ జనతా పార్టీకి విశేష ఆదరణ కనిపిస్తోందని అంటున్నారు.
ఇన్ స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ పేజీకి కేవలం నాలుగు రోజుల్లో 90 లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. ఈ సంఖ్య కేంద్రంలో బీజేపీ కన్నా చాలా ఎక్కువగా చెబుతున్నారు. మే 16న ‘ఎక్స్’ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభించగా, ఆ మరునాడు ఇనస్టాగ్రామ్ లో కూడా అకౌంట్ ప్రారంభించారు. అక్కడ కేవలం 78 గంటల్లో 30 లక్షల మందిని ఆకర్షించింది. ఆ తర్వాత మరింత దూకుడుగా 90 లక్షల మందికి చేరింది. ప్రస్తుతం దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పోల్చితే ఇన్ స్టాలో కాక్రోచ్ పార్టీకి గణనీయంగా ఫాలోవర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి 13.2 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, కాక్రోచ్ పార్టీకి ప్రస్తుతం 9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఇక 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఫాలోవర్ల సంఖ్య 8.7 మిలియన్లుగా ఉండటం గమనార్హం. మరో జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీకి 1.9 మిలియన్ల మంది మాత్రమే ఫాలోవర్లు ఉన్నారు. ఇక బీజేపీ తన పేజీలో దాదాపు 18 వేల పోస్టులు పెడితే 8.7 మిలియన్ల ఫాలోవర్లు రాగా, కాక్రోచ్ పార్టీ కేవలం 56 పోస్టులతోనే బీజేపీని అధిగమించడం విశేషంగా చెబుతున్నారు.
