సోషల్ మీడియాలో ‘కాక్రోచ్’ ప్రకంపనలు.. షాక్ ఇచ్చిన ‘ఎక్స్’
కేవలం 4 రోజుల్లోనే కోటికి పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియా సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి ఎక్స్ షాక్ ఇచ్చింది.
By: Tupaki Political Desk | 21 May 2026 8:41 PM ISTకేవలం 4 రోజుల్లోనే కోటికి పైగా ఫాలోవర్లతో సోషల్ మీడియా సంచలనంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి ఎక్స్ షాక్ ఇచ్చింది. ఈ నెల 16న ‘ఎక్స్’ వేదికగా ఆవిర్భవించిన వ్యంగ్య పార్టీ దేశంలోని అధికార పార్టీకి ఊహించని తలనొప్పిగా మారింది. దీంతో అనుమతి లేని రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదుతో ‘కాక్రోచ్ పార్టీ’కి చెక్ చెప్పిందని అంటున్నారు. భారత్ లో దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్న కాక్రోచ్ జనతా పార్టీ అకౌంటును బ్లాక్ చేసినట్లు ఎక్స్ ప్రకటించింది.
సోషల్ మీడియాలో క్రేజ్
కాక్రోచ్ పార్టీకి గంట గంటకు ఫాలోవర్లు పెరిగిపోవడంపై ఆందోళన చెందిన అధికార పార్టీ అభిమానులు రిపోర్టు కొట్టినట్లు చెబుతున్నారు. దీంతో న్యాయపరమైన కారణాలు చూపుతూ భారత్ లో ఆ అకౌంటును బ్లాక్ చేస్తున్నట్లు ఎక్స్ వెల్లడించింది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ఎక్స్ (ట్విట్టర్) నిలిపివేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం 4 రోజుల్లోనే ఊహించని స్థాయిలో ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ అకౌంట్‌ను ఎక్స్ సంస్థ ఎందుకు నిలిపివేసింది? అంటూ నెటిజన్లు పెద్ద సంఖ్యలో సెర్చ్ చేస్తున్నారు.
విత్ హెల్డ్ లో అకౌంటు
ప్రస్తుతం దేశంలో ఈ ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే "అకౌంట్ విత్ హెల్డ్ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ లీగల్ డిమాండ్’ అంటే చట్టపరమైన అభ్యర్థన మేరకు ఈ ఖాతాను నిలిపివేసాం అని కనిపిస్తోంది. ఎక్స్ నిబంధనల ప్రకారం... ఏదైనా అధీకృత ప్రభుత్వ సంస్థ లేదా కోర్టు నుండి చట్టబద్ధమైన ఆదేశాలు వచ్చినప్పుడు, స్థానిక చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడటానికి నిర్దిష్ట దేశంలో ఆ ఖాతాను నిలిపివేస్తారని చెబుతున్నారు. దీంతో సుప్రీం సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యలకు నిరసనగా పుట్టిన కాక్రోచ్ పార్టీ ప్రస్థానం ఎక్స్ లో ముగిసిందని అంటున్నారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ అన్న అకౌంటును నిలిపివేసిన కొద్ది సేపటికే కాక్రోచ్ ఈస్ బ్యాక్ అంటూ మరో అకౌంటు ప్రత్యక్షమవడం గమనార్హం.
రికార్డు సంఖ్యలో ఫాలోవర్లు
కాగా, కాక్రోచ్ జనతా పార్టీ పేజీ ప్రారంభించిన తక్కువ సమయంలోనే రికార్డు సంఖ్యలో ఫాలోవర్లు రావడం సోషల్ మీడియాను కుదిపేసింది. ఎక్స్ లో ఈ పేజీకి రెండు లక్షల ఫాలోవర్లు ఉండగా, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పేజీ కేవలం కొన్ని రోజుల్లోనే ఏకంగా 1.35 కోట్ల కంటే ఎక్కువ ఫాలోవర్లను సాధించింది. ఇది అధికార భారతీయ జనతా పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 8.8 మిలియన్లు కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.
ప్రభుత్వ విధానాలపై నిరసన
అయితే నీట్ పేపర్ లీకేజీ, ప్రభుత్వ విధానాలపై ఈ అకౌంట్ ద్వారా తీవ్రమైన వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో.. ప్రభుత్వం నుంచి వచ్చిన లీగల్ నోటీసుల ఆధారంగా ఎక్స్ దీనిని భారత్‌లో నిలిపివేసిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అకౌంట్ నిలిపివేతపై కాక్రోచ్ జనతా పార్టీ పేజీ సృష్టికర్త అభిజీత్ దిప్కే స్పందిస్తూ... "మేము తప్పు చేయలేదు, విద్యార్థుల ఆత్మహత్యలపై, పేపర్ లీకేజీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. ఒక వ్యంగ్య (Satire) అకౌంట్ అంటే ప్రభుత్వానికి అంత భయమా?" అంటూ ప్రశ్నించారు.
