'ఆప్' పుట్టినట్టే.. రాజకీయ శక్తిగా కాక్రోచ్ జనతా పార్టీ? జాతీయ స్థాయిలో ఇదే హాట్ టాపిక్
దేశంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న యూత్ మూవ్‌మెంట్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) రాజకీయ పార్టీగా మారనుందా? అనే చర్చ ఇప్పుడు తీవ్రంగా జరుగుతోంది.
By: Tupaki Desk | 27 July 2026 8:35 AM ISTదేశంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న యూత్ మూవ్‌మెంట్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) రాజకీయ పార్టీగా మారనుందా? అనే చర్చ ఇప్పుడు తీవ్రంగా జరుగుతోంది. ఒక ‘వ్యంగ్య రాజకీయ ఉద్యమం’గా సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ వేదిక, అనూహ్యంగా కోట్లాది మంది యువతను ఆకట్టుకుని విద్యావ్యవస్థలోని లోపాలపై ప్రభుత్వాన్ని నిలదీసే స్థాయికి చేరింది. నీట్ పేపర్ లీకు ఘటనలకు బాధ్యుడిని చేస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించే వరకు ఈ ఉద్యమం సాగడమే అందరినీ ఆకర్షిస్తోంది. ఆన్‌లైన్ మీమ్స్, హాస్యం ద్వారా ప్రారంభమైన ఈ వేదిక క్రమంగా రోడ్డెక్కిన నిరసనలకు దారితీయడం, లక్షలాది మంది యువత ప్రత్యక్షంగా ఆందోళనల్లో పాలుపంచుకోవడంతో ‘కాక్రోచ్ పార్టీ’ ఒక శక్తివంతమైన ఉద్యమంగా విజయవంతమైంది. ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ నేతలు రాజకీయ పార్టీని ప్రారంభిస్తారా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తమ ఉద్యమానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడంతో పాటు, రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో సీజేపీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సీజేపీ తెచ్చిన ఒత్తిడితో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అంగీకరించడం ఈ ఉద్యమం సాధించిన అతిపెద్ద విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతను ఆకర్షించిన కాక్రోచ్ జనతా పార్టీ, భవిష్యత్తులో రాజకీయ అడుగులు వేసే అవకాశాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో అన్నా హజారే ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) మాదిరిగా, సీజేపీ లేదా దాని నుంచి మరొక వేదిక రాజకీయ రంగప్రవేశం చేస్తుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
అయితే, కాక్రోచ్ ఉద్యమాన్ని నడిపిన అభిజిత్ దీప్కే కానీ, ఆయనకు మద్దతుగా నిలిచిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కానీ ఇంతవరకు తమకు ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు ఉన్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. కేంద్ర మంత్రి రాజీనామా తర్వాత కూడా తాము దేశ యువత హక్కుల కోసం ఉద్యమాలే చేస్తామని చెప్పడంతో, సీజేపీ సమీప భవిష్యత్తులో రాజకీయ శక్తిగా రూపాంతరం చెందే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, 2011లో అన్నా హజారే నేతృత్వంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన "ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్" ఉద్యమం ఈ సందర్భంగా మరోమారు చర్చకు తావిస్తోంది.
అప్పట్లో అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఉద్యమం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ జన్మించింది. ప్రభుత్వంలో అవినీతిని అరికట్టడానికి బలమైన లోక్‌పాల్ చట్టం తీసుకురావాలని ఆ ఉద్యమం డిమాండ్ చేసింది. ఆ పోరాటంలో కీలక పాత్ర పోషించిన అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ వంటి ప్రముఖులు.. వ్యవస్థను బయటి నుండి మార్చడం కష్టమని భావించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే, ప్రస్తుతం సీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఒక్కరూ అటువంటి ప్రకటనలు చేయడం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావానికి, ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పరిణామాలకు కొన్ని పోలికలు కనిపిస్తున్నప్పటికీ, దీని రూపం, స్వభావం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కచ్చితంగా చెప్పలేం కాబట్టి, సీజేపీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందేనని అంటున్నారు.
