ఢిల్లీపై ‘కాక్రోచ్’ దండయాత్ర.. బొద్దింక మాస్కులు ధరించి భారీ ఆందోళన
కాక్రోచ్ జనతా పార్టీ తన తొలి ప్రత్యక్ష పోరాటాన్ని విజయవంతం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు వేలాది మంది యువత తరలివచ్చారు.
By: Tupaki Political Desk | 6 Jun 2026 12:17 PM ISTకాక్రోచ్ జనతా పార్టీ తన తొలి ప్రత్యక్ష పోరాటాన్ని విజయవంతం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు వేలాది మంది యువత తరలివచ్చారు. అమెరికా నుంచి ఈ ఉదయమే ఢిల్లీ వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే విమానాశ్రయంలో దిగిన వెంటనే నేరుగా జంతర్ మంతర్ కు చేరుకున్నారు. అంతేకాకుండా ఆందోళన కార్యక్రమానికి ముందు శాంతియుత ఆందోళనకు అందరూ సహకరించాలని కోరుతూ ట్వీట్ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ దద్దరిల్లింది. వేలాది మంది యువత తరలిరావడంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కాక్రోచ్ పార్టీ ధర్నాకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుందా? లేదా? అన్న సంశయం మధ్య పోలీసులు సులువుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు 5వ తేదీలోపు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని లేదంటే తాము 6న ఆందోళన చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాక్రోచ్ పార్టీ డిమాండ్ నెరవేరకపోవడంతో అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చిన కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నేరుగా జంతర్ మంతర్ కు వెళ్లి ఆందోళనకు దిగారు.
దేశంలోని నిరుద్యోగ యువత, విద్యార్థుల గొంతుకగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' పిలుపుతో జంతర్ మంతర్ వద్ద శనివారం నిర్వహించిన ధర్నా విజయవంతమైందని ప్రకటించారు. సీజేపీ పిలుపు మేరకు వేలాది మంది యువత రోడ్డుపైకి వచ్చారు. బొద్దింకల ఫొటోతో ఉన్న మాస్క్ తోపాటు చేతిలో జాతీయ పతాకం, రాజ్యాంగ ప్రతిని పట్టుకుని రావాలని సీజీపీ పిలుపుతో చాలా మంది ఆందోళనకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు.
ఎయిర్ పోర్టులో టెన్షన్
ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి అమెరికాలో చదువుకుంటున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఉదయం బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానంలో ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ల్యాండ్ అయిన వెంటనే ఇమ్మిగ్రేషన్ వద్ద 10 నుంచి 15 మంది భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టి, ఒక అపరిచిత ప్రాంతానికి తరలించారని ప్రచారం జరిగింది. అయితే, కొంత సమయం తర్వాత ఆయన సురక్షితంగా బయటకు వచ్చారు. ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు రాగానే ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ‘నేను ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను. జంతర్ మంతర్ వద్ద మిమ్మల్ని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మీతో పాటు ఒక పుస్తకాన్ని, మన త్రివర్ణ పతాకాన్ని తీసుకురావడం మర్చిపోకండి. పోలీసులకు ప్రేమపూర్వకంగా పూలు ఇచ్చి మన కృతజ్ఞతను చాటుకుందాం. ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా, ప్రేమతో ముందుకు తీసుకెళ్దాం’ అని పిలుపునిచ్చారు.
భారీ భద్రత.. పోలీసుల అనుమతి
ముందుగా ఈ నిరసనకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలిపినప్పటికీ, శాంతిభద్రతల దృష్ట్యా 1000 మందికి పైగా పోలీసులను, పారామిలటరీ దళాలను జంతర్ మంతర్ వద్ద మోహరించారు. నిరసనకారులు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు కాకుండా నేరుగా జంతర్ మంతర్ వద్దకు చేరుకోవాలని సీజేపీ ప్రతినిధులు కోరారు. చివరకు తీవ్ర ఉత్కంఠ నడుమ జంతర్ మంతర్ వద్ద శాంతియుత ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా స్వచ్ఛందంగా తరలివచ్చిన యువతతో నిరసన వినూత్నంగా సాగింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి నిరసన స్థలానికి 'హిట్' (బొద్దింకల నివారణ స్ప్రే) డబ్బాతో రావడంతో పోలీసులు అతడిని అక్కడి నుండి తరలించారు.
సీజేపీ అధికారిక ప్రతినిధులు సౌరవ్ దాస్, విజేత దహియా, అశుతోష్ రాంకా మీడియాలో మాట్లాడుతూ.. ‘ఈరోజు విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వానికి సెటైర్ భరించే ఓపిక లేదు, అందుకే బొద్దింకలు అంటే అంత భయం. కానీ ఈ నియంతృత్వ ధోరణి దేశ యువత కళ్ళు తెరిపిస్తోంది’ అని ధ్వజమెత్తారు. ‘బొద్దింకలు వస్తున్నాయి.. ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తున్నారు’ అనే నినాదంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ ఉద్యమం ట్రెండ్ అవుతోంది.
