Begin typing your search above and press return to search.

సీబీఐ చేతికి ‘బొద్దింకల’ కేసు.. కాక్రోచ్ జనతా పార్టీకి భారీ షాక్?

దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒక వింతైన, వ్యంగ్య సామాజిక మాధ్యమ ఉద్యమం జాతీయ రాజకీయాలను కుదిపేస్తోందని చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   25 May 2026 1:25 PM IST
సీబీఐ చేతికి ‘బొద్దింకల’ కేసు.. కాక్రోచ్ జనతా పార్టీకి భారీ షాక్?
X

దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒక వింతైన, వ్యంగ్య సామాజిక మాధ్యమ ఉద్యమం జాతీయ రాజకీయాలను కుదిపేస్తోందని చెబుతున్నారు. రాత్రికి రాత్రే ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, అధికార బీజేపీని అధిగమించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వెనుక కుట్ర కోణం ఉందని, ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఆలోచనతో విదేశీ శక్తులు ఆన్ లైన్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైందని అంటున్నారు. కాక్రోచ్ పార్టీ కార్యకలాపాలు, దాని వెనుక ఉన్న శక్తుల నిగ్గు తేల్చాలని దాఖలైన పిటిషన్ దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోందని చెబుతున్నారు.

ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసినట్లు మే 16న ఎక్స్ లో ప్రకటించారు. నకిలీ డిగ్రీలతో చట్టాన్ని, వ్యవస్థలను వాడుకునే వారిని ఉద్దేశించి ‘బొద్దింకలు’, ‘సమాజ పరాన్నజీవులు’ అని సుప్రీం సీజేఐ వ్యాఖ్యానించారని వార్తలు వచ్చాయి. అయితే తాను నకిలీ సర్టిఫికెట్ల గ్రూపులను మాత్రమే అన్నానని, నిరుద్యోగ యువతను కాదని సీజేఐ స్పష్టం చేసినా, ఆన్ లైన్ వేదికగా జెన్ జీ యువతకు ప్రతినిధిగా కాక్రోచ్ పార్టీ నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టింది.

మహారాష్ట్రకు చెందిన డిజిటల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అభిజీత్ దీప్కే ప్రారంభించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆన్ లైన్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘మమ్మల్ని తొక్కేయాలని చూశారు.. కానీ మేము తిరిగి వచ్చాం’ అనే నినాదంతో, ఏఐ సాంకేతికతను వాడుకుంటూ కోటు-సూటు వేసుకున్న బొద్దింక బొమ్మతో ఈ పేజీని అభిజిత్ క్రియేట్ చేశారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థలోని లోపాలపై వ్యంగ్యంగా మీమ్స్ పోస్టు చేశాడు. ఈ పేజీ యువతను ఆకర్షించడంతో రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్లు పెరిగిపోయారని అంటున్నారు.

సుప్రీంకోర్టులో పిటిషన్

ఇక కాక్రోచ్ పార్టీ కారణంగా ప్రభుత్వ ప్రతిష్ఠకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు కోర్టు వ్యాఖ్యలను కావాలనే క్లిప్ చేసి, కమర్షియల్‌గా, ఆల్గోరిథమిక్‌గా మానిప్యులేట్ చేస్తూ వ్యవస్థలపై బురద జల్లుతున్నారని ఆ పిటిషన్ లో ఆరోపించారు. దీనివెనుక నకిలీ అడ్వకేట్ల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్న అసలు సూత్రధారులపై సీబీఐ విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. అయితే, దీనిపై అర్జంట్ హీరింగ్‌ను సుప్రీంకోర్టు నిరాకరిస్తూ, దీన్ని అంత సెంటిమెంట్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం పక్కన పెట్టిందని చెబుతున్నారు.