Begin typing your search above and press return to search.

బీరు కంటే తక్కువ ధరకే కొకైన్... లీగల్ చేసేద్దామా?

అవును... స్విట్జర్లాండ్ రాజధాని కొకైన్‌ ను వినోద వినియోగం కోసం చట్టబద్ధంగా విక్రయించడానికి అనుమతించే విషయాన్ని పరిశీలిస్తోందని కథనాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 Dec 2023 4:25 AM GMT
బీరు కంటే తక్కువ ధరకే కొకైన్... లీగల్  చేసేద్దామా?
X

ప్రపంచానికి ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఉగ్రవాదం ఒకటైతే.. డ్రగ్స్ వినియోగం రెండోది అని అంటారు. పేదరికం, నిరక్షరాస్యత, నేరాలు పెరిగిపోవడంలో వీటిపాత్ర కీలకం అని చెబుతుంటారు. మరోపక్క డ్రగ్స్ కు వ్యతిరేకంగా కొన్ని దేశాలు అంతర్యుద్ధాలు చేస్తున్న స్థాయిలో పోరాడుతుంటాయి! ఈ సమయంలో కొకైన్ వినియోగం విషయంలో స్విట్లర్జాండ్ సంచలన నిర్ణయం తీసుకోబోతుందనే కథనాలు అంతర్జాతీయ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

అవును... స్విట్జర్లాండ్ రాజధాని కొకైన్‌ ను వినోద వినియోగం కోసం చట్టబద్ధంగా విక్రయించడానికి అనుమతించే విషయాన్ని పరిశీలిస్తోందని కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం... ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా బెర్న్‌ లోని పార్లమెంటు ఈ పైలట్ ప్రోగ్రాంకు మద్దతు ఇచ్చిందని తెలుస్తుంది. దేశంలో ఎక్కువగా ఉన్న మాదకద్రవ్యాల వినియోగాన్ని సురక్షితంగా చేసే ప్రయత్నంలో భాగమనే కామెంట్లు వినిపిస్తుంది!

ఈ సమయంలో డ్రగ్స్ పై స్విట్జర్లాండ్ తన వైఖరిని పునఃపరిశీలిస్తున్నందున ఇది వచ్చిందని.. కొంతమంది రాజకీయ నాయకులు, నిపుణులు డ్రగ్స్‌ పై పూర్తి నిషేధం పనికిరాదని విమర్శిస్తున్నారని తెలుస్తుంది. ఈ తాజా ప్రతిపాదన ప్రస్తుతం ప్రారంభ దశలో ఉండటంతో... గంజాయిని చట్టబద్ధంగా విక్రయించడానికి ట్రయల్స్ జరుగుతున్నాయని చెబుతున్నారు.

స్విట్జర్లాండ్ పార్లమెంట్ లో ఇలాంటి బిల్లు ప్రతిపాదనకు కో స్పాన్సర్ చేసిన ఆల్టర్నేటివ్ లెఫ్ట్ పార్టీకి చెందిన బెర్న్ కౌన్సిల్ సభ్యురాలు ఎవా చెన్ ఈ విషయాలపై స్పందిస్తూ... డ్రగ్స్‌ పై యుద్ధం విఫలమైందని.. దీంతో తాము కొత్త ఆలోచనలను చూడాలని.. అణచివేత కంటే మెరుగ్గా నియంత్రణ, చట్టబద్ధత చేయవచ్చని తెలిపారు!

ఇదే సమయంలో స్విట్జర్లాండ్ లో కొకైన్ ఏ స్థాయిలో విరివిగా, క్వాలిటీగా, చీప్ గా దొరుకుతుందనే విషయాలపై అడిక్షన్ స్విట్జర్లాండ్‌ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాంక్ జోబెల్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా తాము ఇప్పటివరకూ ఎన్నడూ చూడని క్వాలిటీతో, చౌకైన ధరకు స్విట్జర్లాండ్ లో చాలా కొకైన్ అందుబాటులో ఉందని తెలిపారు! బీర్ ధర కంటే తక్కువకే ఇక్కడ కొకైన్ దొరుకుతుందని వెల్లడించారు.

కాగా... ఐరోపాలో కొకైన్ వినియోగం ఎక్కువగా ఉన్న దేశాల్లో స్విట్జర్లాండ్ ఒకటి కాగా.. ఐరోపాలో కొకైన్ వినియోగంలోని టాప్ 10 నగరాల్లో జ్యూరిచ్, బాసెల్, జెనీవా ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికే స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్‌ తో సహా అనేక యూరోపియన్ దేశాల్లో కొకైన్‌ తో సహా మాదక ద్రవ్యాలను కలిగి ఉంటే జైలు శిక్షలు లేవు. అయితే ప్రపంచంలో ఫస్ట్ టైం బెర్న్‌ చర్చలో తాజా ప్రతిపాదన తెరపైకి వచ్చి వైరల్ గా మారింది!