సక్సెస్ సాలా.. ఏపీకి కోకా-కోలా! రూ.1,127 కోట్లతో రెండు పరిశ్రమలు!
కోకో-కోలా ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (SIPCs) అధికారికంగా ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాల సమాచారం.
By: Tupaki Desk | 17 Sept 2026 6:30 PM ISTఏపీలో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, సులభతర వ్యాపార నిర్వహణకు ఆకర్షితులై ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వరుసగా ఒప్పందాలు కుదర్చుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ రూ.1,127 కోట్లతో విజయనగరంలో కొత్త పరిశ్రమతోపాటు చిత్తూరు జిల్లాలో ఉన్న పరిశ్రమ విస్తరణకు ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుందని చెబుతున్నారు. కోకో-కోలా ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (SIPCs) అధికారికంగా ఆమోదం తెలిపిందని ప్రభుత్వ వర్గాల సమాచారం.
పాలసీల ప్రభావంతో తరలివస్తున్న దిగ్గజాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తెచ్చిన 'ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ పారిశ్రామికవేత్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నయని అంటున్నారు. కేవలం సంప్రదాయ రంగాలకే పరిమితం కాకుండా, మాన్యుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో విలువ ఆధారిత పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పారదర్శకమైన విధానాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతోనే కోకా-కోలా వంటి దిగ్గజ కంపెనీలు భారీ విస్తరణకు మొగ్గు చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎక్కడెక్కడ ఎంత పెట్టుబడి?
కోకా-కోలా సంస్థ ప్రకటించిన రూ.1,127 కోట్ల పెట్టుబడిని రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాలకు కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలను మరింత ఉత్తేజితం చేసేలా రూ.842 కోట్ల వ్యయంతో విజయనగరం జిల్లాలో అత్యాధునిక మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇప్పటికే చిత్తూరు జిల్లాలో కార్యకలాపాలు సాగిస్తున్న కోకా-కోలా ప్రస్తుత ప్లాంట్‌ను మరింత విస్తరించేందుకు రూ.285 కోట్లు వెచ్చించనున్నారు. ఈ రెండు కేంద్రాల ఏర్పాటు ద్వారా దక్షిణ భారతదేశంతో పాటు తూర్పు భారతదేశానికి కూడా బాటిల్ సప్లై చైన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరింత బలపడనుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
విజయనగరం ప్లాంట్‌లో తొలి దశలో మూడు బాట్లింగ్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా సంవత్సరానికి దాదాపు 18 మిలియన్ కేసుల కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, జ్యూసులు, టెట్రా-ప్యాక్ ఉత్పత్తులు తయారవుతాయి. రెండో దశలో మరో రెండు బాట్లింగ్ లైన్లను జోడించి, అదనంగా మరో 12 మిలియన్ కేసుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. శ్రీకాళహస్తి ప్లాంట్‌లో ఒక ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ లైన్‌తో పాటు, రెండు కొత్త కార్బొనేటెడ్ సాఫ్ట్-డ్రింక్ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ కోకా-కోలా, థమ్స్ అప్, స్ప్రిట్, ఫాంటా, లిమ్కా, కిన్లే వంటి ప్రముఖ బ్రాండ్లు తయారవుతాయి.
మెరుగవుతున్న ఉపాధి అవకాశాలు
ఈ తరహా భారీ ప్రాజెక్టుల రాకతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తుండటంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలపడటమే కాకుండా, అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సమర్థవంతమైన పాలసీలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం రానున్న రోజుల్లో ఏపీని దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక హబ్‌గా మారుస్తాయనడంలో సందేహం లేదని అంటున్నారు.
