జనసేన వర్సెస్ టీడీపీ నాన్ స్టాప్ ఫైట్!
కూటమి ప్రభుత్వంలో రాష్ట్రస్థాయిలో కనిపిస్తున్న సమన్వయం నియోజకవర్గ స్థాయిలో లోపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 7 April 2025 7:30 PMకూటమి ప్రభుత్వంలో రాష్ట్రస్థాయిలో కనిపిస్తున్న సమన్వయం నియోజకవర్గ స్థాయిలో లోపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం కాగా, తొలి లొల్లి ప్రారంభమైన నెల్లిమర్ల నియోజకవర్గంలోనూ వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే లోకం మాధవి, టీడీపీ నేత మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజుకు మధ్య అసలు పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది.
నిన్నమొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న పిఠాపురంలో మెగా బ్రదర్, న్యూ ఎమ్మెల్సీ నాగబాబు అడుగుపెట్టడంతోనే అగ్గి రాజేశారు. గత నెలలో జరిగిన జనసేన జయకేతనం సభలోనే పిఠాపురంపై పవన్ గెలుపులో ఎవరి పాత్ర లేదన్న నాగబాబు.. తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ చార్జి వర్మను నిర్లక్ష్యం చేశారు. దీనికి టీడీపీ శ్రేణులు నిరసన తెలపగా, వారిపై కేసులు పెట్టించారు. ఈ వివాదంపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, ఉత్తరాంధ్రలోని నెల్లిమర్లలోనూ ఇదే తీరు కనిపిస్తోందని అంటున్నారు.
పిఠాపురంలో లొల్లి ఈ మధ్యే ప్రారంభమవగా, నెల్లిమర్లలో ముందు నుంచి వివాదాలే చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ చార్జి మధ్య విభేదాలు పొడసూపాయి. ఇక ఈ ఇద్దరి గొడవపై ఇరుపార్టీల అధిష్టాన వర్గాలు జోక్యం చేసుకుని సర్దిచెప్పినా, ఎవరూ కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదంటున్నారు. తన అధికార పర్యటనలకు టీడీపీ నేతలకు సమాచారం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే లోకం మాధవిపై విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మార్క్ ఫెడ్ చైర్మన్ హోదాలో కర్రోతు బంగార్రాజు ప్రొటోకాల్ విషయంలోనూ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం వివాదాలకు కారణమవుతోంది.
నియోజకవర్గంలో గెలిచిన తొలి రోజు నుంచే ఎమ్మెల్యే మాధవి తీరుపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, తమ పనులు కూడా చేయడం లేదని ఎమ్మెల్యే మాధవిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తాము అధికార పార్టీ కార్యకర్తలమైనా ఎమ్మెల్యే తమను ప్రతిపక్షం వారిలా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేకు పోటీగా టీడీపీ ఇన్ చార్జి కర్రోతు బంగార్రాజుతోపాటు నాలుగు మండలాల్లోని ప్రధాన నాయకులు సొంతంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా, ప్రతిచోటా టీడీపీ బలమైన నాయకులు ఉన్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలాంటి నెల్లిమర్లను జనసేనకు కేటాయించడంతో లోకం మాధవి ఎమ్మెల్యేగా గెలిచారు. పొత్తు ధర్మంతో తాము లోకం మాధవిని ఎమ్మెల్యేగా గెలిపించినా, ఆమె తమను నిర్లక్ష్యం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ నేతలు తాడోపేడో తేల్చుకుంటామని చెబుతున్నారు. దీంతో నెల్లిమర్ల రాజకీయాలు రసవత్తరంగా మారాయంటున్నారు.