Begin typing your search above and press return to search.

టాస్కులు ఇవ్వని సీఎం.. ఎందుకిలా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్

గతానికి భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఈసారి హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   3 Sept 2023 12:16 PM IST
టాస్కులు ఇవ్వని సీఎం.. ఎందుకిలా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్
X

గతానికి భిన్నంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ఈసారి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినంతనే కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందన్న వాదన బలంగా వినిపించటమే. తన ఇద్దరు కుమార్తెలతో గడిపేందుకు పది రోజుల ట్రిప్ కు వెళ్లిన ఆయన.. కూతుళ్లతో ఏడురోజులు ఉండనున్నారు. మిగిలిన మూడు రోజులు ప్రయాణాలకు సరిపోయే పరిస్థితి. సెప్టెంబరు 12న తాడేపల్లికి చేరుకునే జగన్.. ఆ వెంటనే అసెంబ్లీని కొలువు తీరుస్తారని చెబుతున్నారు.

ఎందుకిలా? అంటే.. జమిలి ఎన్నికల్లో భాగంగా కేంద్రం కసరత్తు చేయటం.. ఆ దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్న మోడీ సర్కారు.. ఆ సందర్భంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును ప్రవేశ పెడతారన్న వాదన జోరున వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే ఏపీలో మే-జూన్ లో జరగాల్సిన ఎన్నికలు ముందస్తుగా డిసెంబరుకే వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.

దీనికి సంబంధించిన అంశాల్లో జగన్ ఇప్పటికే సిద్ధమయ్యారని చెబుతున్నారు. అదే జరిగితే.. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలు ఆర్నెల్లు ముందు వచ్చే వీలుంది. ఇప్పుడు వినిపిస్తున్న అంచనా ప్రకారం పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయ వాతావరణం మరింత వేడెక్కటం ఖాయం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన విదేశీ పర్యటనల సందర్భంగా రాష్ట్రంలో ఎవరేం చేయాలి? ఏమేం చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి జగన్ టాస్కులు ఇవ్వటం ఒక అలవాటు.

గత ఏడాది విదేశీ పర్యటన సందర్భంగా పార్టీలోని ముఖ్యనేతలు పలువురికి ప్రత్యేక టాస్కులు ఇవ్వటాన్ని గుర్తు చేస్తున్నారు. పెట్టుబడులను సమీకరించటానికి వెళ్లిన సందర్భంలో ఏపీ ప్రధాన ప్రతిపక్షం మహానాడు కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. దీనికి కౌంటర్ గా టీడీపీ మహానాడు వేళలో.. అందుకు ధీటుగా తమ పార్టీ నేతలు బస్సు యాత్రలు చేపట్టాలన్న టాస్కు ఇవ్వటాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టాస్కుకు తగ్గట్లే అప్పట్లో మంత్రులు పలువురు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు మూడు రోజుల పాటు బస్సు యాత్రల్ని నిర్వహించి విపక్షంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

తాజాగా మాత్రం అందుకు భిన్నంగా.. ఎవరికి ఎలాంటి టాస్కులు ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్లటం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ మనసులో ఏదో ఉండి ఉంటుందని.. లేకుంటే ఆయన ఇలా వ్యవహరించరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేయాల్సిన వేళ.. తాను ఇచ్చిన టాస్కులకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటే జరిగే నష్టంతో పోలిస్తే.. ఎవరికి ఎలాంటి లక్ష్యాలు ఇవ్వకుండా ఎవరేం చేస్తారో మదింపు చేస్తే మంచిదన్న ఆలోచనతో జగన్ ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.