Begin typing your search above and press return to search.

ఆ ఊళ్లో రాత్రిళ్లు ఉండేందుకు 'సీఎం' ససేమిరా!

నమ్మకాలకు రాజకీయ నేతలు ఎంతలా కనెక్టుఅయిపోతారో తెలియంది కాదు. ఏళ్లకు ఏళ్లుగా ఉండే నమ్మకాల్ని.. విశ్వాసాల్ని గౌరవించకుండా పదవుల్ని పోగొట్టుకున్న ప్రముఖుల్ని చూశాం.

By:  Tupaki Desk   |   13 Dec 2023 4:43 AM GMT
ఆ ఊళ్లో రాత్రిళ్లు ఉండేందుకు సీఎం ససేమిరా!
X

నమ్మకాలకు రాజకీయ నేతలు ఎంతలా కనెక్టుఅయిపోతారో తెలియంది కాదు. ఏళ్లకు ఏళ్లుగా ఉండే నమ్మకాల్ని.. విశ్వాసాల్ని గౌరవించకుండా పదవుల్ని పోగొట్టుకున్న ప్రముఖుల్ని చూశాం. అయితే.. ఇలాంటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపికైన మోహన్ యాదవ్. ఇప్పటికి మూడుసార్లు ఉజ్జయిని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవకావాన్ని సొంతం చేసుకున్నారు.


మరి.. రాష్ట్రానికి సీఎం హోదాలో ఉన్నప్పుడు సొంతూరులో ఉండేందుకు అంతో ఇంతో ఆసక్తి చూపుతారు. కానీ.. మోహన్ యాదవ్ మాత్రం ఊళ్లో ఉండేందుకు నో అంటే నో అనేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఉజ్జయిని అన్నంతనే అందరికి గుర్తుకు వచ్చేది ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఆయనే అక్కడి రాజు.. పాలకుడు. మతాచారం ప్రకారం చూసినా.. పురాతన నమ్మకాల్ని పరిగణలోకి తీసుకున్నా.. ఉజ్జయిని నగరంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారెవరూ ఆ నగరంలో బస చేయకూడదు. ఒకవేళ ఉండదలిస్తే.. సాదాసీదా వ్యక్తిగా ఉండాలే కానీ.. అధికారాన్ని ప్రదర్శించకూడదు. కాదని మొండికేస్తే.. మొదటికే మోసం ఖాయమని చెబుతారు.

ఉజ్జయిని నివాసి అయిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. సీఎం హోదాలో మాత్రం ఒక్క రోజు కూడా సొంతూళ్లో ఉండేందుకు నో చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. ఉజ్జయిని క్షేత్రంలో తిరుగులేని పాలకుడు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. అలాంటప్పుడు మిగిలిన వారు తమను తాముగా రాజుగా అస్సలు ప్రకటించకూడదు. అందుకే.. వందలఏళ్లుగా రాజులు సైతం ఉజ్జయిని ఊరికి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే తమ బసను ఏర్పాటు చేసుకున్నారు.

ఉజ్జయినికి రాజుగా ఉన్న సింథి రాజకుటుంబీకులు.. వారి వారసులు సైతం నగరానికి పదిమేను కిలోమీటర్ల దూరంలో ఉండేవారు. ఎందుకిలా? అంటే.. గతంలో చోటు చేసుకున్న పలు పరిణామాల గురించి చెబుతారు. పురాతన కాలంలో ఒక ప్రముఖుడు ఉజ్జయిని పాలకుడిగా నియమితుడైన తర్వాతి రోజే కన్నుమూశారు. అప్పటి నుంచి అదో శాపమని భావించిన రాజా విక్రమాదిత్య ఒక సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఉజ్జయినిలో ఎవరు పాలకుడిగా నియమితుడైనా సరే.. సదరు ప్రమఉకుడు మహాకాళేశ్వరుని సర్వధికారిగా భావించి.. ఆయన ఆదేశాలకు తగ్గట్లునడుచుకోవాలి. మహాకాళుని ప్రతినిధిగా మాత్రమే వ్యవహరించాలి.

ఉజ్జయినిలో ఒక్క మహాకాళ్లకు మాత్రమే గార్డ్ ఆఫ్ హానర్ కూడా ఉంటుందని చెబుతారు. పురాతన కాలాన్నిపక్కన పెట్టేసి.. గడిచిన యాభై ఏళ్ల క్రితం జరిగిన పరిణామాల్ని చూసినా.. ఉజ్జయినికి ఉన్న ప్రత్యేకత ఇట్టే అర్థమవుతుంది. దేశ ప్రధానిగా వ్యవహరించిన మురార్జీ దేశాయ్ తాను అంత పెద్ద స్థానంలో ఉన్నప్పుడు.. ఈ క్షేత్రంలో ఉండిపోయారు. ఆ తర్వాతి రోజే ఆయన పదవి పోయింది. ఆయన ప్రభుత్వం కుప్పకూలింది.

ఆ తర్వాతి కాలంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన యడ్యూరప్ప సైతం ఇలాంటి అనుభవం ఎదురైంది. ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్లు.. వీళ్లు చెప్పే మాటల్ని ఎందుకు ఫాలో కావాలని అనుకున్నారో కానీ.. ఉజ్జయినిలో రాత్రి బస చేశారు. కట్ చేస్తే.. ఇది జరిగిన 20 రోజులకు ఆయన పదవి మటాష్ అయ్యింది. అప్పటినుంచి ఉజ్జయిని సెంటిమెంట్ మరింత ఎక్కువైంది. ఈ కారణాలతోనే ముఖ్యమంత్రి తాను ప్రాతినిధ్యం వహించే ఉజ్జయినిలో మాత్రం ఉండేందుకు ససేమిరా అంటున్నారు. ఈ సెంటిమెంట్ ను ఎదుర్కోవటానికి ఎవరూ సిద్ధంగా లేరని మాత్రం చెప్పక తప్పదు.