Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ సతీమణికి ఆస్వస్థత.. ఏ ఆసుపత్రిలో చేర్చారంటే?

శుక్రవారం ఇబ్బందికరంగా ఉండటంతో ఫ్యామిలీ డాక్టర్ ఎంవీ రావు సూచనతో సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 5:30 AM GMT
సీఎం కేసీఆర్ సతీమణికి ఆస్వస్థత.. ఏ ఆసుపత్రిలో చేర్చారంటే?
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవటం.. శుక్రవారం ఇబ్బందికరంగా ఉండటంతో ఫ్యామిలీ డాక్టర్ ఎంవీ రావు సూచనతో సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం వేళలో ఆసుపత్రికి వచ్చిన శోభకు.. పలు వైద్య పరీక్షల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పరీక్షల రిపోర్టులు నార్మల్ గా ఉన్నాయని చెబుతున్నారు.

ప్రస్తుతం శోభ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇంతకూ శోభ ఆరోగ్య సమస్య ఏమిటన్న విషయంపై ఎవరూ వివరాలు చెప్పట్లేదు. అధికారిక ప్రకటన చేసింది లేదు. విశ్వసేనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం గురువారం అర్థరాత్రి నుంచి శోభ తీవ్రమైన జ్వరం.. ఒళ్లు నొప్పులతో ఇబ్బందులు పడుతుండటంతో వైద్యుల సలహా కోరగా.. ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది.

శుక్రవారం సాయంత్రం యశోదా ఆసుపత్రికి చేరుకున్న శోభతో పాటు.. కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి మేనల్లుడు హరీశ్ రావులు వెంట ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆసుపత్రికి వచ్చి.. సతీమణిని పరామర్శించినట్లుగా చెబుతున్నారు. రాత్రి వేళలో మంత్రి హరీశ్ ఆసుపత్రి నుంచి వెళ్లిపోగా.. ఎమ్మెల్సీ కవిత మాత్రం ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడినట్లుగా తెలుస్తోంది.