Begin typing your search above and press return to search.

క్యాంపు పనులు స్పీడందుకుందా ?

దసరా పండుగ నాటికి ముఖ్యమంత్రి కార్యాలయం వైజాగ్ వెళ్ళేందుకు ఉద్దేశించిన పనులు స్పీడందుకుంది.

By:  Tupaki Desk   |   12 Oct 2023 10:48 AM IST
క్యాంపు పనులు స్పీడందుకుందా ?
X

దసరా పండుగ నాటికి ముఖ్యమంత్రి కార్యాలయం వైజాగ్ వెళ్ళేందుకు ఉద్దేశించిన పనులు స్పీడందుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు తరలించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు ఏవన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం త్రిసభ్య కమిటిని నియమించింది. ఏ ఏ ఆఫీసులను విశాఖపట్నంకు తరలించాలి, ఎక్కడెక్కడ ఏర్పాటుచేయాలి ? ఎంత స్పేస్ అవసరం అనే విషయాలను ఈ కమిటి చూసుకుంటుంది. పనిలోపనిగా ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటు బాధ్యత కూడా ఈ కమిటిదే.

మూడు రాజధానుల వివాదం ప్రస్తుతం సుప్రింకోర్టు విచారణలో ఉంది. అందుకనే వైజాగ్ ను ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పటంలేదు. కేవలం సీఎం కార్యాలయం మాత్రమే అక్కడికి వెళుతోందని ప్రభుత్వం చెబుతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. దసరా పండుగ నుండి తాను వైజాగ్ లోనే క్యాంపు వేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే ప్రభుత్వం వైజాగ్ కు మారటంలేదని కేవలం తాను మాత్రమే విశాఖకు మారబోతున్నట్లు చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి ఎక్కడినుండైనా పాలన చేయవచ్చు. పలానా చోటే కూర్చోవాలని ఏ న్యాయస్ధానం కూడా చెప్పలేందు. అందుకనే జగన్ వైజాగ్ తరలిపోతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే కార్యాలయం కూడా ఉండాలి కాబట్టి, ఉన్నతాధికారులు, సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా అనుకున్నట్లే దసరాపండుగకు జగన్ వైజాగ్ వెళ్ళిపోతున్నారు. ఇక మూడు రాజధానుల వివాదం ఎప్పటికి తేలుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఈ కేసును సుప్రింకోర్టు వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటు వెళుతోంది.

ఇదేమంత అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదని సుప్రింకోర్టు అభిప్రాయపడిందేమో. 2024 ఎన్నికలే అన్నీ ప్రశ్నలకు సమాధానం చెబుతుందని కూడా సుప్రింకోర్టు అనుకునుండచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రింకోర్టుల్లో ఉన్న అనేక కేసులకు 2024 ఎన్నికలే సమాధానం చెప్పబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వచ్చే ఫలితాలే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. ఈ విషయాలన్నింటినీ గమనించిన తర్వాతే సుప్రింకోర్టు కూడా మూడు రాజధానుల కేసు విచారణకు తొందరపడటంలేదు. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది అన్నట్లుగా మూడు రాజధానుల వివాదానికి కూడా కాలమే సమాధానం చెబుతుందేమో.