Begin typing your search above and press return to search.

కేజ్రీవాల్‌కు ముందున్న మార్గ‌మేంటి? స‌ర్దుకుపోవ‌డమా? సుప్రీంకు వెళ్ల‌డ‌మా? రాజీనామానా?

53 శాతం ఓట్ల షేర్‌తో ఢిల్లీ గ‌ద్దెను రెండోసారి ద‌క్కించుకున్న అధినేత కేంద్రంతో పోరాడి.. చ‌తికిల ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చారు

By:  Tupaki Desk   |   8 Aug 2023 3:30 PM GMT
కేజ్రీవాల్‌కు ముందున్న మార్గ‌మేంటి?  స‌ర్దుకుపోవ‌డమా?  సుప్రీంకు వెళ్ల‌డ‌మా?  రాజీనామానా?
X

ఒక అప్ర‌తిహ‌త విజ‌యం... కేంద్రంతో పోరాడి త‌ల‌వొంచింది. 53 శాతం ఓట్ల షేర్‌తో ఢిల్లీ గ‌ద్దెను రెండోసారి ద‌క్కించుకున్న అధినేత కేంద్రంతో పోరాడి.. చ‌తికిల ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చారు. ఆయ‌నే ఢిల్లీ ముఖ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌. ఆయ‌న ముఖ్య‌మంత్రి.. అంతో ఇంతో అధికారాలు ఉన్న ముఖ్య‌మంత్రి.. ఇది నిన్న‌టి మాట‌. రేప‌టి నుంచి ఆయ‌న‌ కేవ‌లం ముఖ్య‌మంత్రి. నేమ్ ప్లేట్‌లో మాత్ర‌మే ఆయ‌న ముఖ్య‌మంత్రి. కానీ, ఏ అధికారీ.. ఆయ‌న మాట‌ల‌ను లెక్క‌చేసే ప‌రిస్థితి లేదు.

''నేను ఆ ప‌ని చేయ‌మ‌న్నాను క‌దా.. చేశావా!'' అని ఏ అధికారినీ ఆయ‌న నిల‌దీసే అధికారం కాదు.. క‌దా.. క‌నీసం ప్ర‌శ్నించే అవ‌కాశం కూడా లేకుండా పోతుంది. మొత్తం ఢిల్లీ అధికారాల‌న్నీ కూడా.. కేంద్ర ప్ర‌భుత్వం చెప్పిన‌ట్టు న‌డుచుకునే ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఆయ‌న చెప్పిందే శాస నం, ఆయ‌న చేసిందే.. ఆదేశం. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌తో ప‌నిలేదు. వారు వేసిన ఓట్ల‌తోనూ ప‌నిలేదు. కేంద్రం తీసు కువ‌చ్చిన 'ఢిల్లీ బిల్లే' స‌ర్వ‌స్వం. ఈ బిల్లు చెప్పిందే వేదం.

మ‌రి ఇప్పుడు 53 శాతం ఓటు బ్యాంకుతో అప్ర‌తిహ‌త విజ‌యాన్ని అందుకుని ఢిల్లీ గ‌ద్దెనెక్కిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ఏం చేయాలి? ఆయ‌న ముందున్న మార్గం ఏంటి? కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు దూకు డుకు ఆయ‌న ఎలా క‌ళ్లెం వేయాలి? అనేవి ఆస‌క్తిగా మారాయి. ప్ర‌ధానంగా ఇప్పుడు ఆయ‌న ముందున్న మార్గం స‌ర్దుకుపోవ‌డ‌మే! ఇంత‌కు మించిన అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాద‌ని కోర్టుల బాట ప‌ట్టినా.. ఇప్ప‌ట్లో తేలేది ఏమీ ఉండ‌దు.

ఇక‌, సుప్రీంకోర్టుకు వెళ్లి.. ఫ‌లితం వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అలా కాద‌ని.. ప్ర‌భుత్వాన్ని ఇప్పటికిప్పుడు ర‌ద్దు చేసుకుని.. ఎన్నిక‌ల‌కు వెళ్లినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని అంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో అనేక రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. మోడీపై నిప్పులు చెరిగిన నాయ‌కులు.. అధికారం నుంచి దింపేస్తామ‌ని.. ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు చేసిన నేత‌లు కూడా.. స‌ర్దుకుపోయే ప‌రిస్థితిలోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో కేజ్రీకి కూడా.. ఇప్ప‌టికిప్పుడు ఈ మార్గం త‌ప్ప మ‌రోమార్గం లేద‌ని.. ప‌రిశీల‌కులే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.