Begin typing your search above and press return to search.

తమిళనాడు టు కర్ణాటక.. దళపతి విజయ్ కొత్త వ్యూహం!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే అఖండ మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు సీఎం విజయ్.

By:  Tupaki Desk   |   24 May 2026 2:00 PM IST
తమిళనాడు టు కర్ణాటక.. దళపతి విజయ్ కొత్త వ్యూహం!
X

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే అఖండ మెజారిటీతో అధికారాన్ని దక్కించుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు సీఎం విజయ్. అయితే, ఆయన కేవలం తమిళనాడుకే పరిమితం కావాలని అనుకోవడం లేదని, తన పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని అనుకుంటున్నట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని జాతీయ పార్టీగా విస్తరించే దిశగా దళపతి అడుగులు వేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు తర్వాత కర్ణటకపై కన్నేసిన దళపతి త్వరలో జరిగే బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులను బరిలోకి దించాలని పక్కా ప్లాన్ చేస్తున్నట్లు బలంగా వినిపిస్తోంది.

జూన్‌లో బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయని అంటున్నారు. ఈ నగరంలో తమిళులు భారీగా నివసిస్తున్నారని, వారికి అండగా నిలిచేందుకు బెంగళూరు కార్పొరేషన్ బరిలో టీవీకే పోటీ చేయాలని చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. బెంగళూరు నగరంలో దాదాపు 50 డివిజనుల్లో తమిళుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున, ఆయా డివిజనుల్లో టీవీకే అభ్యర్థులను పోటీకి పెట్టాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు.

బెంగళూరు సిటీలో దాదాపు 20 నుంచి 22 లక్షల మంది వరకు తమిళులు నివసిస్తున్నారని చెబుతున్నారు. చాలా చోట్ల తమిళుల ఓట్లే గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో విజయ్‌కి కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అంటున్నారు. గత కొన్నేళ్లుగా విజయ్ అభిమాన సంఘాలు ఇక్కడ నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండటం కూడా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ముఖ్యమంత్రి విజయ్ తాజా వ్యూహాలు రాజకీయ వర్గాలను షాక్ కు గురిచేస్తున్నాయని అంటున్నారు. సినిమాల్లో పక్కా స్క్రీన్‌ప్లేతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన విజయ్ రాజకీయాల్లో కూడా ఎవరికీ అంతుచిక్కని వ్యూహాలతో పావులు కదుపుతున్నారని విశ్లేషిస్తున్నారు. బెంగళూరు ఎన్నికలను ఆయన ఒక టెస్ట్ రన్ లా భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఫలితాలను బట్టి ఫ్యూచర్ ప్లాన్ వేయొచ్చని ఆయన తన సన్నిహిత వర్గాలతో అన్నట్లు తమిళ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ శాతాన్ని బట్టి కర్ణాటకలో పార్టీని పూర్తిస్థాయిలో విస్తరించాలా? లేదా? అనేదానిపై విజయ్ ఒక క్లారిటీకి రానున్నారని అంటున్నారు.

తమిళనాడు వెలుపల ప్రాంతీయ పార్టీలు రాణించడం అంత ఈజీ కాదు. గతంలో ఏడీఎంకే, డీఎంకే వంటి పార్టీలు కూడా బెంగళూరులో కొన్ని స్థానాల్లో పోటీ చేశాయని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆయా పార్టీలు కర్ణాటకలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని అంటున్నారు. అయితే తొలి ఎన్నికల్లోనే రికార్డు విజయం సాధించిన సీఎం విజయ్ ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. విజయ్ వ్యూహాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో ఎన్నికల్లో చూడాల్సివుందని అంటున్నారు.