అసెంబ్లీలో ఖాళీగా సీఎం సీటు.. సభలోనే సీఎం విజయ్.. ఏమైంది?
తమిళ రాజకీయాలలో ముఖ్యమంత్రి విజయ్ తన విలక్షణ వ్యవహారశైలితో ఆకట్టుకుంటున్నారు.
By: Tupaki Desk | 28 Aug 2026 10:49 PM ISTతమిళ రాజకీయాలలో ముఖ్యమంత్రి విజయ్ తన విలక్షణ వ్యవహారశైలితో ఆకట్టుకుంటున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ముఖ్యమంత్రి విజయ్ మే 10వ తేదీన సీఎం బాధ్యతలు చేపట్టిన నుంచి భిన్నమైన పాలన విధానాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణ నుంచి హంగు, అర్బాటాలు వంటి వాటి జోలికి వెళ్లకుండా సింపుల్ సీఎం అనిపించుకునేలా విజయ్ నడుచుకుంటున్నారు. తన సహజ పనితీరుతో అధికార దర్పానికి దూరంగా ఉండే ఆయన, తాజాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి సీటును వదిలేసి మంత్రుల మధ్య కూర్చుని అందరినీ విస్తుపోయేలా చేశారు. ఈ విలక్షణ శైలితో ఆయన మరోసారి రాజకీయ వర్గాలను, సోషల్ మీడియాను షేక్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారారు.
అసెంబ్లీలో ఊహించని దృశ్యం
సాధారణంగా శాసనసభలో ముఖ్యమంత్రి స్థానానికి అత్యున్నత విశిష్టత ఉంటుంది. ఆ ప్రత్యేక స్థానాన్ని అధికారంలో ఉన్నవారే కాక, ప్రతిపక్షాలు కూడా ఎంతో గౌరవంగా చూస్తాయి. కానీ, సీఎం విజయ్ తనదైన మార్క్ పంథాలో ఈ సంప్రదాయానికి భిన్నంగా నడిచారు. సీఎం సీటును వదిలి మంత్రుల మధ్య కూర్చుని, సభా చర్చల్లో అక్కడి నుంచే చురుగ్గా పాల్గొన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన సభలోని ప్రతి ఒక్కరూ ఒక్కక్షణం ఆశ్చర్యపోయారు. "తాను ముఖ్యమంత్రిని అయినంత మాత్రాన ప్రత్యేక వ్యక్తిని కాను, మీలో ఒకడిని మాత్రమే" అనే బలమైన సందేశాన్ని ప్రజలకు, సహచర ఎమ్మెల్యేలకు పంపడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీవీకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రజల మనసు గెలుస్తున్న శైలి
ఇదంతా చూసేవారికి ఏదో సినిమాలోని సన్నివేశంలా సినిమాటిక్ గా అనిపించవచ్చునని పరిశీలకులు అంటున్నారు. తెరపై హీరోల మాదిరిగా సామాన్యుల మధ్య కలిసిపోవడమే ఆయన రాజకీయ అజెండాగా కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి విజయ్ అనుసరిస్తున్న సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రొటోకాల్స్ కంటే సామాన్యులతో మమేకం కావడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ తరహా రాజకీయ శైలి రాజకీయ ప్రత్యర్థులకు వింతగా అనిపించినా, యువత, సామాన్య ప్రజలను మాత్రం విపరీతంగా ఆకర్షిస్తోందని చెబుతున్నారు.
గతానికీ, ఇప్పటికీ మారని విజయ్ మార్క్ పంథా
విజయ్ ఇలాంటి విలక్షణ శైలిని ప్రదర్శించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు సైతం వివాదాలకు దూరంగా ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. పార్టీ పెట్టిన కొత్తలోనూ, ప్రజా సమస్యలపై స్పందించే తీరులోనూ ఎక్కడా దర్పం ప్రదర్శించకుండా అత్యంత సాధారణంగా వ్యవహరించేవారని గుర్తుచేస్తున్నారు. తాజాగా అసెంబ్లీలోనూ అదే నిరాడంబరతను కొనసాగించి, పదవి కంటే జనమే ముఖ్యమనే భావనను మరోసారి బలంగా చాటిచెప్పారని అంటున్నారు. రాజకీయాల్లో మార్పును కోరుకుంటున్న ప్రజలకు విజయ్ వ్యవహారశైలి ఓ సరికొత్త ప్రయోగంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఏది చేసినా తనదైన శైలిలో వైరల్ అయ్యేలా విజయ్ మరోసారి సఫలమయ్యారని అంటున్నారు. అధికారాన్ని అలంకారంగా కాకుండా, ప్రజల మధ్య ఉండే సాధనంగా ఆయన మలుచుకుంటున్న తీరు తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పును తీసుకువస్తోందని చెబుతున్నారు.
