Begin typing your search above and press return to search.

ఆసియా ఛాంపియన్స్ కు సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్స్

రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వ పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మనసు గెలుచుకుంటున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   5 Oct 2026 3:47 PM IST
ఆసియా ఛాంపియన్స్ కు సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్స్
X

రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వ పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల మనసు గెలుచుకుంటున్నాయని అంటున్నారు. గతంలో పాలన అనుభవం లేకపోయినా, ఆయన అనుసరిస్తున్న వినూత్న విధానాలు చర్చనీయాంశం అవుతున్నాయి. కేవలం సమస్యల పరిష్కారానికే పరిమితం కాకుండా, ప్రజలకు దగ్గరయ్యేలా విజయ్ నిర్ణయాలు ఉన్నాయంటూ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పతక విజేతలతో సీఎం విజయ్ ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం అభినందనలు తెలిపి, చెక్కులు అందజేసి పంపించేయకుండా, వారితో కలిసి విందు భోజనం చేస్తూ ముచ్చటించాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.

ఆసియా క్రీడల్లో అసాధారణ విజయాలు

జపాన్ వేదికగా జరిగిన 20వ ఆసియా క్రీడలలో భారత క్రీడాకారులు అపూర్వమైన ప్రదర్శన కనబరిచారు. ఈ టోర్నమెంట్‌లో భారత్ మొత్తం 85 పతకాలను (21 స్వర్ణాలు, 26 రజతాలు, 38 కాంస్యాలు) సాధించి చరిత్ర సృష్టించింది. క్రికెట్, హాకీ, షూటింగ్, అథ్లెటిక్స్ వంటి పలు విభాగాల్లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన క్రీడాకారులు సైతం అద్భుతమైన ప్రతభను ప్రదర్శించారు. కేవలం 18 ఏళ్ల మధురై అమ్మాయి జీ.కమలిని క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకం సాధించింది. ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం విజయ్ రూ. 75 లక్షల భారీ నజరానాను ప్రకటించారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో విత్య రామ్‌రాజ్ (కాస్యం, స్వర్ణం), స్క్వాష్ ఆటగాళ్లు జోష్ చినప్ప, షమీనా రియాజ్, వెలవన్ సెంథిల్‌కుమార్, అభయ్ సింగ్, అలాగే రిలే పరుగులో అభినయ రాజరాజన్, విశాల్ టి.కె, రాజేష్ రమేష్ తదితరులు పతకాలు సాధించి తమిళనాడు కీర్తిని ఇనుమడింపజేశారు.

క్రీడాభివృద్ధికి విజయ్ ప్రణాళికలు

సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా క్రీడాకారులు పతకాలు గెలిస్తే, మంత్రులు లేదా అధికారులు ఎవరో ఒకరు వారిని ఆహ్వానించి నామమాత్రంగా సత్కరించి చేతులు దులుపుకుంటారు. కానీ సీఎం విజయ్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పతక విజేతలను కేవలం సత్కరించడమే కాకుండా, వారితో కలిసి భోజనం చేస్తూ.. క్రీడా రంగంలో వస్తున్న మార్పులు, అథ్లెట్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల పరిస్థితి గురించి ఆరా తీయనున్నారు.

తమిళనాడులో క్రీడలను అట్టడుగు స్థాయి నుంచి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చెన్నై సమీపంలో అత్యాధునిక హంగులతో కూడిన ‘స్పోర్టింగ్ సిటీ’ని నిర్మించనున్నట్లు విజయ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు భారీ నజరానాలు ప్రకటించడం ఆయన క్రీడాభిమానానికి నిదర్శనం అంటున్నారు. పాలనానుభవం లేదన్న విమర్శలను పక్కన పెట్టి, ప్రజా సంక్షేమంతో పాటు ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న సీఎం విజయ్ తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.