ఆదివారాలు.. పండుగలు.. రేవంత్ నో రెస్ట్.. 365 డేస్ ఆన్ డ్యూటీ
బుధవారం.. వినాయక చవితి... ఇంట్లో కుటుంబంతో కలిసి వినాయక పూజ చేశారు రేవంత్. సాయంత్రానికి రాష్ట్రమంతటా వర్షాలు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బీభత్సం అని కథనాలు వచ్చాయి.
By: Tupaki Desk | 28 Aug 2025 2:59 PM ISTగత ఆదివారం... తెలుగు సినిమా రంగంలో దిగ్గజాలు అనదగ్గ నిర్మాతలు, దర్శకులు వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.. వారితో కొన్ని గంటల పాటు భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.
బుధవారం.. వినాయక చవితి... ఇంట్లో కుటుంబంతో కలిసి వినాయక పూజ చేశారు రేవంత్. సాయంత్రానికి రాష్ట్రమంతటా వర్షాలు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో బీభత్సం అని కథనాలు వచ్చాయి. దీంతో సీఎం సమీక్ష చేపట్టారు. దీనికిముందే ఆయన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై చర్చించారు. అదే సమయంలో వర్షాల తీవ్రత పెరగడంతో అధికారులను అలర్ట్ చేశారు.
..ఈ రెండు సందర్భాల్లోనే కాదు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసలు విశ్రాంతి తీసుకోరా..? ఆదివారాలు కూడా పనిచేస్తారా...? అనిపిస్తూ ఉంటుంది. గతంలోనూ ఎన్నోసార్లు ఆయన ఆదివారాలు సైతం సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. పండుగ వేళల్లోనూ బాధ్యతల్లోనే కనిపించారు.
సొంత ఇల్లే కార్యాలయం...
సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ లో సొంత ఇల్లు ఉంది. సచివాలయానికి వెళ్లడం తప్ప క్యాంప్ ఆఫీస్ అంటూ ఏమీ లేదు. ఇల్లు, క్యాంప్ ఆఫీస్ కోసం కొన్ని నిర్మాణాలు, ప్రదేశాలను పరిశీలించినా దాదాపు రెండేళ్ల నుంచి ఏవీ సాకారం కాలేదు. చివరకు అదే జూబ్లీహిల్స్ ఇంటి నుంచి సీఎం సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో భేటీకి.. తాజాగా సినీ పరిశ్రమ ప్రముక దర్శక, నిర్మాతలతో సమావేశానికి జూబ్లీహిల్స్ నివాసమే వేదిక అయింది.
అధికారుల్లోనూ బాధ్యత...
రాజకీయ నాయకులు, ప్రముఖులతోనే కాదు.. సీఎం రేవంత్ ఉన్నతాధికారులతోనూ జూబ్లీహిల్స్ నివాసంలోనే సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఆదివారాలు, సెలవు దినాలు మినహాయింపు లేదు. సీఎం అంతటి వ్యక్తే సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నందున అధికారుల్లోనూ బాధ్యత పెంచుతోందని, వారిని అలర్ట్ గా ఉండేలా చేస్తోందని అంటున్నారు. తరచూ పర్యటనలకు తోడు రేవంత్ ముందుండి నడిపిస్తున్నట్లుగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు. పాలనలో చురుకుదనానికి కారణం అవుతోందని చెబుతున్నారు.
