Begin typing your search above and press return to search.

రేవంత్ మీద కేటీఆర్ వాడుతున్న భాష బాగుందా ?

తమిళనాడులో ఇలాగే విపక్షాల నుంచి విమర్శలు వస్తే ముఖ్యమంత్రి స్టాలిన్ అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   17 April 2025 10:10 PM IST
రేవంత్ మీద కేటీఆర్ వాడుతున్న భాష బాగుందా ?
X

భారత రాజ్యాంగంలో ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి. పరోక్ష పద్ధతిలో అయినా ప్రజలు నుంచి ఎన్నుకున్న వారే సీఎం అవుతారు. అలాగే పీఎం అవుతారు. రాజ్యాంగబద్ధమైన సీటు అది. ఆ సీటుకు ఎవరైనా విలువ ఇవ్వాల్సిందే పైగా ప్రజా తీర్పు కూడా అందులో ఇమిడి ఉంటుంది.

ఇక రాజకీయాల్లో చూస్తే విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ అవి వ్యక్తిగత దూషణలుగా మారకూడదు. అంతే కాదు వారు అధిరోహించిన రాజ్యాంగ పదవులకు ఇబ్బందిగా ఉండరాదు. కానీ ఇపుడు ఎక్కడ చూసినా అదే జరుగుతోంది. నేరుగా సీఎం ని పట్టుకుని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అవి కాస్తా శృతి మించుతున్నాయి.

తమిళనాడులో ఇలాగే విపక్షాల నుంచి విమర్శలు వస్తే ముఖ్యమంత్రి స్టాలిన్ అసహనం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సీఎం కి గౌరవం ఇవ్వరా అని ఆయన ప్రశ్నించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. మరో వైపు చూస్తే కనుక తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. ఆయన పాలన మీద విమర్శలు చేస్తే చేయవచ్చు.

కానీ వ్యక్తిగతంగా నిందించడం మీదనే చర్చ సాగుతోంది. లేటెస్ట్ గా సీఎం ని పట్టుకుని పిరికి సన్యాసి అని కేటీఆర్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి ఆయన ఏ సందర్భంలో ఆ మాట అన్నారో తెలియదు కానీ అది అభ్యంతరకరమే అని అంటున్నారు. సీఎం స్థాయిని ఆయన కూర్చున్న సీటుకి ఇవ్వాల్సిన గౌరవం మరచి ఈ తరహా ఆరోపణలు చేయడం వల్ల లాభమేంటి అన్న చర్చ సాగుతోంది.

దీని మీద సోషల్ మీడియాలో కూడా కేటీఅర్ కి వ్యతిరేకంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సీఎం ని ఎంతలా విమర్శిస్తే అంతలా జనాలలో ఇమేజ్ పెరుగుతుందని భావిస్తే అది తప్పు అనే అంటున్నారు. అదే పనిగా విమర్శలు చేసినా అవి హాట్ హాట్ గా ఉన్నా కూడా జనాల నుంచి వేరే రియాక్షన్ వస్తుందని చివరికి బూమరాంగ్ అవుతుందని అంటున్నారు.

అపుడెపుడో ఉద్యమ కాలంలో సన్నాసులు అని కేసీఆర్ వాడిన భాష అభ్యంతరకరంగా ఉన్నా ఆ వేడిలో అలా చెల్లిపోయింది. కానీ ఇపుడు ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు అయింది. అది కూడా పదకొండేళ్లు అవుతోంది. అంతా ఒకే రాష్ట్రం వారే. అందరూ ప్రజల కోసం పాటు పడేందుకు వచ్చిన వారే. ఇక పదేళ్ళ పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇపుడు కాంగ్రెస్ కి ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ మాత్రం దానికి ఓర్చుకోకపోతే ఎలా అని నెటిజన్ల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బొత్తిగా పదిహేను నెలలు మాత్రమే అయింది అని గుర్తు చేస్తున్నారు. ఇంతలోనే అంత రచ్చ చేయడం ఈ రోజు ఎన్నికలు పెడితే మాదే అధికారం అని జబ్బలు చరచుకోవడం ఇవన్నీ కూడా ప్రజలకు వేరే సంకేతాలు పంపిస్తాయని అంతిమంగా ఇబ్బందిలో బీఆర్ఎస్ పడాల్సి వస్తుందని అంటున్నారు. అందువల్ల సీఎం రేవంత్ మీద వ్యక్తిగత దాడిని తగ్గించి ప్రజా సమస్యల మీద గట్టిగా పోరాటం చేస్తేనే ఫలితం ఉంటుందన్న సూచనలు వస్తున్నాయి.