కేటీఆర్ చర్చకు రావాలి.. ప్లేస్ డిసైడ్ చేస్తా: బండి
ఇలా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నా యకుడు బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు.
By: Tupaki Desk | 27 July 2025 3:40 PM ISTఏపీకి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వర్సెస్ తెలంగాణకు చెందిన బీఆర్ ఎస్ నాయకుడు కేటీఆర్ మధ్య మాటల యుద్ధ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో అక్రమంగా కాంట్రాక్టులు దక్కించుకున్నారని.. సీఎం రేవంత్ రెడ్డికి రూ.10 వేల కోట్ల అప్పు ఇప్పించారని.. దీనిలో కుంభకోణం చోటు చేసుకుందని కేటీఆర్ విమర్శించారు. దీనికిప్రతిగా సీఎం రమేష్.. నిప్పులు చెరిగారు. కేటీఆర్‌కు మతి భ్రమించిందన్నారు. ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు.
దేనికైనా చర్చకు సిద్ధమేనని చెప్పారు. బీఆర్ ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ తన వద్దకు వచ్చారని ఈసందర్భంగా సీఎం రమేష్ బాంబు పేల్చారు. కవితను జైలు నుంచి విడుదల చేయిస్తే.. ఈడీ, సీబీఐ దాడులు జరగకుండా చూస్తే.. బీఆర్ ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని కేటీఆర్ తనకు చెప్పారన్నారు. దీనిపై చర్చకు రావాలని అన్నారు. ఇదే విషయంపై కేటీఆర్ కూడా.. స్పందించారు. చర్చకు తాను కూడా రెడీనేనని చెప్పారు. అయితే..ఈ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి, రమేష్‌లు ఇద్దరూ కలిసి రావాలని అన్నారు.
ఇలా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నా యకుడు బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. రమేష్ చెప్పింది.. నూటికి రెండు వందల పాళ్లు వాస్తవమేన న్నారు. బీఆర్ ఎస్ దగుల్బాజీ రాజకీయాలు చేస్తోందని విరుచుకుపడ్డారు. బీజేపీలో విలీనం చేస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నారని.. ఈ విషయాన్ని కవిత కూడా చెప్పిన విషయం గుర్తులేదా? అని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో సీఎం రమేష్-కేటీఆర్ చర్చకు రావాలని.. సమయం చెబితే.. వేదికను తానే ఏర్పాటు చేస్తానని బండి సంచలన ప్రకటన చేశారు.
రమేష్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరంలో ఎవరెవరికి కాంట్రాక్టులు ఇచ్చారో.. ఎలా ఇచ్చారో.. కూడా చెప్పాలని నిలదీశారు. బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని.. దానిని బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదన్నారు. అయితే.. దీనిపై కూడా కేటీఆర్ చర్చకు రావాల్సి ఉంటుందన్నారు. లేకపోతే.. రమేష్ చెప్పింది నిజమని ఒప్పుకొన్నట్టేనని బండి వ్యాఖ్యానించారు.
