Begin typing your search above and press return to search.

సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ...రాజకీయ సవాళ్ళ వెనక ?

అనకాపల్లి జిల్లాలో స్థానిక ఎంపీ బీజేపీకి చెందిన నాయకుడు సీఎం రమేష్, అలాగే చోడవరం వైసీపీ ఇంచార్జి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   12 Oct 2026 8:58 AM IST
సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ...రాజకీయ సవాళ్ళ వెనక ?
X

అనకాపల్లి జిల్లాలో స్థానిక ఎంపీ బీజేపీకి చెందిన నాయకుడు సీఎం రమేష్, అలాగే చోడవరం వైసీపీ ఇంచార్జి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇద్దరూ పరస్పర విమర్శలు చేసుకుంటూ గత కొంతకాలంగా రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. గతంలో గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి నుంచి ఇపుడు ఎంపీగా రమేష్ ఉన్నారు. ఇక చోడవరం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి గుడివాడ రెడీ అవుతున్నారు. ఆయన అనకాపల్లి రాజకీయాల్లో వైసీపీ తరఫున చురుకుగా ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్యన మాటల యుద్ధం అయితే రాజుకుని ఈ రోజుకీ మంట పుట్టిస్తోంది. ఎక్కడ ఎవరు మొదలెట్టారో కానీ అది అలాగే కంటిన్యూ అవుతోంది.

జెడ్పీటీసీగా అంటూ :

తాజాగా సీఎం రమేష్ జెడ్పీటీసీగా అమర్నాథ్ పోటీ చేస్తే తాను చేసి ఆయన్ని ఓడిస్తాను అని సవాల్ చేశారు. జెడ్పీటీసీగా గెలవలేరన్నట్లుగా ఆయన గుడివాడ మీద పొలిటికల్ పంచులు వేశారు అన్న మాట. దానికి ధీటుగా గుడివాడ కూడా కౌంటర్ వేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ ఏమిటి అని అంటూ సీఎం రమేష్ ఓటు కడపలో ఉందని ఆయన జెడ్పీటీసీగా కార్పోరేటర్ గా పోటీ చేస్తే స్కూర్టినీలోనే ఆయన అనర్హుడు అవుతారు అని కామెంట్స్ చేశారు. తనతో పోటీ చేయడానికి రమేష్ ఉత్సాహం చూపిస్తే మాత్రం అనకాపల్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి రావాలని కొత్త సవాల్ చేశారు.

ఓడితే తప్పుకుంటా :

తాను అనకాపల్లి నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తాను అని రమేష్ కూటమి తరఫున బరిలోకి దిగినా కొత్త పార్టీతో వచ్చినా ఓకే అన్నారు. తాను ఓటమి చెందితే రాజకీయాల నుంచి మానుకుంటాను అని గుడివాడ స్పష్టం చేశారు. అయితే సీఎం రమేష్ ఓటమి చెందితే మాత్రం ఈ ప్రాంతం వదిలేసి కడపకు వెళ్ళిపోవాలని గుడివాడ షరతు పెట్టారు. ఆయన ఎంపీ అయ్యాక అనకాపల్లి ప్రాంతం వణికిపోతోంది అన్నారు. ఆయన వర్గం దోపిడీకి అంతా భయభ్రాంతులు అవుతున్నారని గుడివాడ విమర్శించారు. ఈ సవాల్ కి సీఎం రమేష్ స్వీకరించాలని లేకపోతే తన గురించి మాట్లాడవద్దని గుడివాడ స్పష్టం చేశారు.

అంతటితో సరినా :

నిజానికి సీఎం రమేష్ కానీ గుడివాడ కానీ సవాళ్ళు చేసుకున్నా ఉప ఎన్నికలు తెచ్చి పోటీ చేసేది ఉంటుందా అన్నదే చర్చ. అధినాయకత్వాలు ఈ ఇద్దరి నాయకులకూ ఉన్నాయి. వారే నిర్ణయిస్తారు అని అంటున్నారు. కానీ నీవు పోటీ చెయ్ అని సులువుగా సవాళ్ళు చేసుకోవడం వల్ల మీడియాకు వినోదం తప్పించి మరేమీ కాదని అంటున్నారు. ఇక గుడివాడ అయితే లోకల్ నాన్ లోకల్ అంటూ రమేష్ మీద విమర్శలు చేస్తూంటే గుడివాడ తన సొంత నియోజకవర్గం గాజువాకలోనే 2024 ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారని సీఎం రమేష్ ఎద్దేవా చేస్తున్నారు. ఇక పంచదార్ల కొండలలో అక్రమ మైనింగ్ జరిగింది అని గుడివాడ ఆరోపించారు. వైసీపీ దీని మీద ఉద్యమాలు చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ నో మైనింగ్ జోన్ గా ప్రకటించారు. దాని వల్లనే రమేష్ వర్గం గుడివాడ మీద విమర్శల జోరు పెంచింది అని వైసీపీ నేతలు అంటున్నారు. అనకాపల్లి రాజకీయాల్లో రమేష్ జోరు చూపిస్తున్నారని అందుకే గుడివాడ టార్గెట్ చేస్తున్నారు అని ఆయన వర్గం అంటోంది. అందుకే ఈ సవాళ్ళ పర్వం సాగుతోంది అని చెబుతున్నారు.