సిట్ పిలిస్తే చాలా విషయాలు చెబుతా : మద్యం స్కాంపై సీఎం రమేశ్
మద్యం స్కాంలో చాలా విషయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి పెట్టలేదని ఎంపీ రమేశ్ వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 25 May 2025 3:49 PM ISTఏపీ మద్యం స్కాంపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాల్లో పనిచేసిన సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల వద్ద నుంచి వైసీపీ నేతలు కమీషన్లు వసూలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సిట్ చాలా విషయాలను వదిలేసిందని, తనను పిలిస్తే వైసీపీ నేతలు ఎలా స్కాం చేసింది పూర్తిగా తెలియజేస్తానని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అనకాపల్లి ఎంపీ వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంపై తన వద్ద పూర్తి సమాచారం ఉందని వెల్లడించారు.
మద్యం స్కాంలో చాలా విషయాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దృష్టి పెట్టలేదని ఎంపీ రమేశ్ వ్యాఖ్యానించారు. సిట్ తనను ఆహ్వానిస్తే మద్యం కుంభకోణానికి సంబంధించి తన వద్ద ఉన్న సమాచారం అందజేస్తానని వివరించారు. గత ప్రభుత్వంలో సర్కారీ దుకాణాల్లో పనిచేసిన కాంట్రాక్టు సిబ్బంది నుంచి ప్రతి నెల కమీషన్ రూపంలో రూ.5 కోట్లు వసూలు చేసేవారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా మద్యం దుకాణాలు, డిపోల వద్ద సెక్యూరిటీ సిబ్బంది వేతనాల నుంచి రూ.3 కోట్లు చొప్పున నెలనెలా కమీషన్ తీసుకున్నారని చెప్పారు. వీటికి సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు.
ఇక ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన విమర్శలపైనా ఎంపీ సీఎం రమేశ్ స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అప్పుల సామ్రాట్ అంటూ జగన్ విమర్శించడాన్ని ఆయన తిప్పికొట్టారు. జగన్ ప్రకటన ప్రకారం రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.లక్ష కోట్ల అప్పు ఉంటే, ఆ తర్వాత చంద్రబాబు రూ.2,49,350 కోట్లు అప్పు చేశారని తెలిపారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేసినట్లు ప్రకటించినట్లు సీఎం రమేశ్ తెలిపారు. చంద్రబాబు కంటే రూ.లక్ష కోట్లు ఎక్కువ అప్పు చేసిన జగన్ తిరిగి ముఖ్యమంత్రిని అప్పుల సామ్రాట్ అంటూ అభివర్ణించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగినట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే జగన్ రాజకీయాల నుంచి వైదొలుగుతారా? అని సీఎం రమేశ్ సవాల్ విసిరారు.
