హెలికాఫ్టర్ కోసం రూ.220 కోట్లు ఖర్చు!! జగన్ పై లోకేశ్ ఫైర్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ వీక్లీ ట్రిప్స్ పై విపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలను ప్రభుత్వం గట్టిగా తిప్పికొడుతోంది.
By: Tupaki Desk | 24 Sept 2025 12:51 PM ISTసీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ వీక్లీ ట్రిప్స్ పై విపక్ష వైసీపీ చేస్తున్న విమర్శలను ప్రభుత్వం గట్టిగా తిప్పికొడుతోంది. కూటమిలోని ముగ్గురు నేతలు ప్రతి వారం వీకెండ్స్ కోసం హైదరాబాద్ వెళుతున్నారని, వారం వారం ప్రభుత్వ ఖర్చులతో ముగ్గురు కీలక నేతలు హైదరాబాద్ వెళ్లడం వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఇటీవల వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అంతేకాకుండా ముగ్గురు నేతలకు పక్క రాష్ట్రంలో పనేం ఉందని కూడా ప్రశ్నిస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ టూర్స్ పై వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అయితే విపక్షం విమర్శలపై మంత్రి లోకేశ్ మంగళవారం దీటుగా స్పందించారు.
ప్రజాధనం దుర్వినియోగం విషయంలో తమ ప్రభుత్వం పొదుపు పాటిస్తుందని చెప్పిన లోకేశ్.. గత ఐదేళ్లలో జగన్ తన పర్యటనల నిమిత్తం రూ.220 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. తక్కువ దూరాలకు కూడా ఆయన హెలికాఫ్టర్ వినియోగించారని ఎత్తిచూపారు. జగన్ ప్రయాణాల వల్ల సగటున ఒక్కో ప్రయాణానికి రూ.7 కోట్లు ఖర్చయిందని వివరించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పర్యటనకు గరిష్టంగా రూ.25 లక్షలు ఖర్చు మాత్రమే ఖర్చు అవుతోందని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో చంద్రబాబు పర్యటనల నిమిత్తం రూ.100 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో జగన్ రూ.220 కోట్లు ఖర్చు చేసిన విషయాన్ని మరచిపోకూడదని లోకేశ్ ధ్వజమెత్తారు.
ఈ నేపథ్యంలో ముఖ్య నేతల హెలీకాఫ్టర్ల వినియోగంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటనపై అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. తాడేపల్లి నుంచి పక్కనే ఉన్న నాగార్జునవర్సిటీకి వెళ్లాలన్నా జగన్ హెలికాఫ్టర్ వాడేవారని టీడీపీ విమర్శలు గుప్పించేది. ఇక కూటమి ప్రభుత్వంలో కూడా జగన్ ప్రయాణాలపై టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టి 51వ సారి బెంగళూరు వెళ్లిపోయారంటూ విమర్శలు గుప్పించింది. దీనికి కౌంటరుగా వైసీపీ కూడా కూటమి నేతల ప్రయాణ లెక్కలపై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వార్ స్టార్ట్ చేసింది.
చంద్రబాబు, లోకేశ్ హెలికాఫ్టర్ వాడకాన్ని గుర్తు చేస్తూ ‘కరో కరో జల్సా కరో.. మీ తండ్రి కొడుకుల పని బాగుంది. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలు వేసుకుని షేర్ ఆటోల మాదిరి ఇష్టానుసారం షికార్లు చేస్తున్నారు. రైతులు, విద్యార్థులు.. ఎవరు అల్లాడిపోతున్నా మీ జల్సాలకు మాత్రం లోటు లేదులే.. ఎవడబ్బ సొమ్మని ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్ వెళ్లారు? తండ్రీకొడుకులు రాష్ట్రానికి భారమే తప్ప ఎవరికీ పైసా ప్రయోజనం లేదని వైసీపీ ట్వీట్ లో ప్రశ్నించింది.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆంధ్రాలో కన్నా హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటూ ఇప్పటికే 122 సార్లు ప్రత్యేక విమానాల్లో షికార్లు చేశారు. మీ ముగ్గుర్ని సుఖపెట్టడానికి రాష్ట్ర ప్రజలు కష్టించి పన్నులు కడుతున్నారంటూ వైసీపీ ట్వీట్ చేసింది. దీనిపై మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. జగన్ వాడిన ప్రత్యేక హెలికాప్టర్, విమానం ఖర్చు రూ.220 కోట్లు దాటిందన్నారు. లీజుకు తెచ్చిన చాపర్ తో చంద్రబాబు సమయం, డబ్బు ఆదా చేస్తున్నారని లోకేశ్ వివరించారు. చంద్రబాబు 15 నెలల్లో చేసినన్ని పర్యటనలు జగన్ ఐదేళ్లలోనూ చేయలేదని చెప్పారు.
