విశాఖలో జగన్ చేయలేనిది చంద్రబాబు చేసి చూపించారు
ప్రైవేటీకరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న విశాఖ ఉక్కును ఆ గండం నుంచి గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలించింది.
By: Tupaki Desk | 1 April 2025 11:00 PM ISTఏపీ సీఎం చంద్రబాబు ఖాతాలో మరో విజయం నమోదైంది. ప్రైవేటీకరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న విశాఖ ఉక్కును ఆ గండం నుంచి గట్టెక్కించేందుకు సీఎం చంద్రబాబు చేసిన కృషి ఫలించింది. సీఎం చంద్రబాబు ఉక్కు సంకల్పానికి కేంద్రం సహకరించడంతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రమాదం నుంచి బయటపడింది. ఈ దిశగా సోమవారం తొలి అడుగు పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకు రూట్ మ్యాప్ సిద్ధమైంది.
ఆంధ్రుల హక్కు - విశాఖ ఉక్కు. ఈ నినాదం ఒకప్పుడు ఏపీని ఊపేసింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా అదే నినాదం వైజాగ్ స్టీల్ ను కంటికి రెప్పలా కాపాడుతోంది. అయితే తీవ్రమైన ఆర్థిక నష్టాలతో మూసివేత వరకు వెళ్లిన విశాఖ ఉక్కుకు ఇప్పుడు కేంద్రం అన్నివిధాల సహకరిస్తోంది. గత కొన్నేళ్లుగా కార్మికుల చేస్తున్న పోరాటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పలం కూడా తోడవడంతో ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్రం భారీ ప్యాకేజ్ ప్రకటించింది. తాజాగా ఆ ప్యాకేజ్ ని ఎలా అందజేయాలనేది నిర్ణయమైంది.
రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, సంయుక్త కార్యదర్శి అబిజిత్ నరేంద్ర, ఎన్ఎండీసీ ఎండీ అమితవ ముఖర్జీ, విశాఖ ఉక్కు ఇంచార్జీ జీఎం అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సీఎండీ ఎస్కే వర్మ, ఎంఎస్టీసీ సీఎండీ మనోబేంద్ర ఘోషల్ తదితరులు విశాఖ స్టీల్ విషయంపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రం విడుదల చేస్తున్న ఆర్థిక సాయంతో విశాఖ ఉక్కు పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
నష్టాల ఊబిలో చిక్కుకుపోయిన విశాఖ ఉక్కును ఆదుకునేందుకు ప్యాకేజీ ప్రకటించిన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించారు. ప్లాంట్ పురోగతి, బ్లాస్ట్ ఫర్నేస్‌లపైనా సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్లాంట్‌కు ఎస్‌పీఎఫ్‌తో భద్రత కల్పిస్తామన్న సీఎం హామీపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కృతజ్ఞతలు తెలియజేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌తో ఏపీ ప్రజలకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు ఉక్కు శాఖ అధికారులకు గుర్తుచేశారు. విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తేవాలని ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ఆయన కేంద్ర బృందానికి భరోసా ఇచ్చారు. అయితే, ప్లాంట్ నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని చంద్రబాబు సూచించారు.
