Begin typing your search above and press return to search.

టీడీపీలో కొత్త రూల్స్.. ఎమ్మెల్యేలు ఎప్పుడు, ఏం చేయాలి? హైకమాండ్ టైంటేబుల్ ఇదే..

కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Political Desk   |   16 Nov 2025 3:10 PM IST
టీడీపీలో కొత్త రూల్స్.. ఎమ్మెల్యేలు ఎప్పుడు, ఏం చేయాలి? హైకమాండ్ టైంటేబుల్ ఇదే..
X

కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లిన సమయంలో అందిన ఫిర్యాదులు, కేబినెట్ మీటింగులో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన విషయాలు, మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్ కు ఒకేరోజు 5 వేల ఫిర్యాదులు రావడాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు తగిన దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం తరఫున తాను, మంత్రులు ఎంతలా కష్టపడినా ఎమ్మెల్యేలు, ప్రజలకు మధ్య గ్యాప్ ఉంటే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని భావించిన సీఎం.. ఎమ్మెల్యేల నిర్లక్ష్య ధోరణిని సరిదిద్దాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏం చేయాలన్న అంశమై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఎమ్మెల్యేలు కేడర్, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్ల సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని సీఎం భావిస్తున్నారు. దీంతో ఇకపై ఎమ్మెల్యేలు నిరంతం ప్రజల మధ్య ఉండటమే కాకుండా, ప్రభుత్వ కార్యక్రమాల్లో వారు పూర్తిగా భాగస్వాములు అయ్యేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. కూటమికి చెందిన 164 మంది ఎమ్మెల్యేలు ఇకపై హైకమాండ్ చెప్పిన ప్రకారమే నడుచుకోవాల్సివుంటుందని సూచించారు. ఇప్పటికే మంత్రి లోకేశ్ సూచనల ప్రకారం ప్రతి శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రజాదర్బార్ నిర్వహించాల్సివుంటుంది. దీనికి అదనంగా ప్రత్యేక టైంటేబుల్ రూపొందించి, ఎమ్మెల్యేలు ఆ ప్రకారం నడుచుకోవాలని ఆదేశాలు వెళ్లాయి.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక పెన్షన్ల పంపిణీ, అన్నా క్యాంటీన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ వంటివాటి పట్ల ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదని ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో 48 మంది ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం లేదని సీఎం దృష్టికి వెళ్లింది. ఇలా ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటే అసలుకే ఎసరు వస్తుందని ఆగ్రహించిన సీఎం.. ఆయా ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని సూచించారు. అదే సమయంలో భవిష్యత్తులో ఈ పద్ధతి కొనసాగకూడదని పార్టీ యంత్రాంగానికి స్పష్టం చేశారు.

దీంతో ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏం చేయాలనే అంశమై పార్టీ స్పష్టమైన సూచనలతో టైంటేబుల్ తయారు చేశారు. ఈ ప్రకారం ఎమ్మెల్యేలు అందరూ ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో విధిగా పాల్గొనాల్సివుంటుంది. అదేవిధంగా పార్టీ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచనలు వెళ్లాయి. ఆ తర్వాత 5వ తేదీన ప్రతి శాసనసభ్యుడు విధిగా నియోజకవర్గం పరిధిలో పాఠశాలను సందర్శించాల్సివుంటుంది. అక్కడ విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం, వసతి, బోధనాంశాలపై తెలుసుకోవాలి. ఆ తర్వాత 10వతేదీన అన్నా క్యాంటిన్లను తనిఖీ చేయాలి.

అన్నా క్యాంటిన్లలో పేదలకు అందుతున్న భోజనం, శుభ్రత, సిబ్బంది ప్రవర్తనపై తెలుసుకోవాల్సివుంటుందని పార్టీ కార్యాలయం నుంచి సమాచారం పంపారు. ఇక 15వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేయాలి. 20న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయాలి. 25న మండల స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాలి. ప్రజల సమస్యలు, ఉద్యోగుల పనితీరుపై ఆరా తీయాల్సివుంటుంది. ఇదే సమయంలో నెలలో ఏదేనా రోజు ఒక గ్రామాన్ని సందర్శించి ఇంటింటికీ తిరగాలి. అదేవిధంగా పల్లె నిద్ర చేయాల్సివుంటుంది. ఇలా ప్రతి ఎమ్మెల్యే పార్టీ ఆదేశాలను పాటిస్తుందీ లేనిదీ కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తారు. నిర్దేశిత సమయంలో నిర్ణయించిన కార్యక్రమం చేసిందీ? లేనిదీ కూడా కేంద్ర కార్యాలయానికి తెలియజేయాల్సివుంటుంది. దీనిద్వారా ప్రజలతో ఎమ్మెల్యేలు నిరంతరం టచ్ లో ఉండేలా సీఎం చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు. ఫలితంగా ఎమ్మెల్యేల పనితీరులో మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు.