బ్యాంకులు ప్రజల కోసమా.. మీ కోసమా? : చంద్రబాబు ఆగ్రహం
''ప్రపంచం మారుతోంది. ప్రజలు మారుతున్నారు. కానీ, నిబంధనల పేరుతో మీరే(బ్యాంకులు) మారడం లేదు.
By: Garuda Media | 26 Aug 2025 3:34 PM ISTరాష్ట్రంలో బ్యాంకులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం బ్యాంకులు ఏర్పాటు చేశారా? లేక.. మీ వ్యక్తిగత లాభాలు పెంచుకునేందుకు ఏర్పాటు చేశారా? అని నిలదీశారు. తాజాగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకురావాలని తాను గతంలో అనేక సార్లు సూచించానని.. అయినా.. బ్యాంకర్లు నిబంధనల పేరుతో ప్రజలను ఇరకాటంలోకి నెడుతున్నాయని విమర్శించారు. నిబంధనలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని, కానీ, వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని వ్యాఖ్యానించారు.
''ప్రపంచం మారుతోంది. ప్రజలు మారుతున్నారు. కానీ, నిబంధనల పేరుతో మీరే(బ్యాంకులు) మారడం లేదు. ఇది సరికాదు. కాలానికి అనుగుణంగా మీరు మారాల్సిన అవసరం ఉంది.'' అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండే విధానాలు అమలు చేస్తేనే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటికే సగంకాలం గడిచిపోయిందన్న సీఎం చంద్రబాబు.. రైతులకు రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేక పోయారని బ్యాంకర్లను నిలదీశారు.
అంతా అయిపోయిన తర్వాత.. రుణాలు ఇచ్చినా.. రైతులకు ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తోందని.. దీనికి బ్యాంకర్ల సహకారం కోరుతున్నామని.. కానీ, ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. 175 నియోజకవర్గాల్లో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేయాలి నిర్ణయించామని.. దీనికి కూడా బ్యాంకర్లు సహకరించాలని కోరారు. ``మీ స్పందన సరిగా లేకపోతే.. ప్రభుత్వం నుంచి కూడా అలానే స్పందన ఉంటుంది.`` అని చంద్రబాబు తొలిసారి హెచ్చరించారు.
నియంత్రణ ఎవరికి?
బ్యాంకులు వివిధ రూపాల్లో నియంత్రణ విధిస్తున్నాయని.. చిన్న మొత్తం అప్పునకే ప్రజలను బ్యాంకుల చుట్టూ పత్రాల కోసం తిప్పుతున్నారని అన్నారు. ఇలాంటి నియంత్రణలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజలను నియంత్రించడం వల్ల బ్యాంకులు పుంజుకుంటాయా? అని ప్రశ్నించారు. తదుపరి సంస్కరణల దిశగా ప్రజలను ప్రోత్సహించాల్సిన బ్యాంకులే ఇంకా నిబంధన చట్రం నుంచి బయటకు రాలేక పోతున్నాయన్నారు. బ్యాంకులు తమ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
