Begin typing your search above and press return to search.

పాస్టర్ ప్రవీణ్ మరణంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! కుట్ర చేసిందెవరు?

పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని వైసీపీ చూస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు.

By:  Tupaki Desk   |   3 April 2025 6:17 PM IST
పాస్టర్ ప్రవీణ్ మరణంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు! కుట్ర చేసిందెవరు?
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్లర్ ప్రవీణ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై సీఎం మాట్లాడారు. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ మరణించిన కేసులో ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోతే తీవ్ర నింద కాయాల్సివచ్చేదని చెప్పారు. కోడికత్తి, గులకరాయ, బాబాయ్ హత్య కేసులు మాదిరిగా ఈ విషయంలోనూ తప్పు టీడీపీపై నెట్టే ప్రయత్నం చేశారంటూ వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని వైసీపీ చూస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి సీసీ కెమెరాల్లో ఒక్కో అంశం బయటకు వస్తోందని చెప్పారు. ప్రవీణ్ డెత్ మిస్టరీ ఛేదనలో సీసీ కెమెరాలది కీలక పాత్రగా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మనం అప్రమత్తంగా లేకపోతే బాబాయ్ గొడ్డలిపోటు, కోడికత్తి, గులకరాయి తరహాలో మనపై నిందలు వేసేవారన్నారు. చేసిన మంచి చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే, లేనిపోని నిందలు వేసేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ కుట్రలను తిప్పికొట్టేందుకు మంత్రులు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఇచ్చే సంక్షేమ పథకాలు నాలుగు రెట్లు అధికమని, అయినా సరైన ప్రచారం చేసుకోలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కర్మయోగి ట్రైనింగ్, విజన్ 2047పైనా మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగు ఉద్యోగులకు సంబంధించిన ఆప్కాస్ పైనా మంత్రివర్గంలో సీరియస్ డిస్కషన్ జరిగింది. గత ప్రభుత్వం ఆప్కాస్ ను ఏర్పాటు చేసి ఉద్యోగ నియామకాల్లో నిబంధనలు పాటించలేదని మంత్రివర్గం అభిప్రాయపడింది.

విచ్చలవిడి నియామకాలతో వ్యవస్థలను నాశనం చేశారని మంత్రులు వ్యాఖ్యానించారు. దీంతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఔట్ సోర్సింగ్ నియామకాలను సక్రమ పద్ధతికి తీసుకొద్దామని సీఎం సూచించారు. అదేవిధంగా స్వర్ణ గ్రామం పేరుతో ఉన్నతాధికారులు పల్లె నిద్ర చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు 3 రోజులు, 2 రాత్రులు పల్లె నిద్ర కార్యక్రమంలో పల్లె నిద్ర చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి పల్లె నిద్ర, పల్లె వెలుగు, స్వర్ణ గ్రామం పేర్లు పరిశీలించాలని సూచించారు.