సీఐ శంకరయ్య పరువునష్టం దావా.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘ఒక్కో వ్యవస్థనూ సరిదిద్దుకుంటూ వస్తున్నామని’ ఆయన వివరించారు.
By: Tupaki Desk | 26 Sept 2025 12:04 AM ISTశాంతిభద్రతలు, సోషల్ మీడియాపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వివేకా హత్య కేసులో సీఎం ఆరోపణలను తప్పుబడుతూ సీఐ శంకరయ్య పంపిన పరువు నష్టం నోటీసులపైనా ఆయన స్పందించారు. ప్రస్తుత సమాజంలో ప్రజలు నిద్ర లేచిన నుంచి మళ్లీ నిద్రపోయే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ‘శాంతిభద్రతలు, సోషల్ మీడియా దుర్వినియోగం’పై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫేక్ ప్రచారం చేస్తూ ఇష్టానుసారం ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పేటియం బ్యాచ్‌లు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని, కొన్నిసార్లు అది ఫేక్ అని మనమే చెప్పుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఇకపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. అలాగే టెక్నాలజీ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నందున ప్రజలు ‘నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయే వరకూ జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.
నేరాలకు అండగా నిలుస్తున్నారు
గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘ఒక్కో వ్యవస్థనూ సరిదిద్దుకుంటూ వస్తున్నామని’ ఆయన వివరించారు. నేరస్థులకు అండగా ఉండే రాజకీయ నేతలను నేను ఇంతవరకూ చూడలేదని సీఎం వ్యాఖ్యానించారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తులను బయటపెట్టాలని, వారి ముసుగు తొలగిస్తే ప్రజలే వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని సీఎం అన్నారు. రాజకీయాల్లో చాలా మందిని ఎదుర్కొన్న తాను ఇప్పుడు ‘నేరస్తుల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివేకా హత్య కేసు ప్రస్తావన
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ‘వివేకా హత్య కేసు’ను ప్రస్తావించారు. హత్య జరిగినప్పుడు క్రైమ్ సీన్‌లో సీఐ శంకరయ్య ఉన్నారని, మొదట్లో గుండెపోటు అని చెప్పడానికి ప్రయత్నించారని, కానీ అది గొడ్డలి పోటు అని తేలిందని వివరించారు. అక్కడున్న రక్తాన్ని శుభ్రం చేశారని, ఏమీ తెలియని వారిలా అమాయకంగా వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో ముఖ్యమంత్రిగా తననూ ఏమార్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమినల్స్‌తో కలిసి పోయి ముఖ్యమంత్రికే నోటీసు పంపించే స్థాయికి సీఐ శంకరయ్య చేరుకున్నారని సీఎం మండిపడ్డారు. ఇది ‘ఫేక్ రాజకీయాలకు ప్రత్యక్ష ఉదాహరణ’ అంటూ చంద్రబాబు ఎత్తిచూపారు.
మహిళలకు రక్షణ కల్పించాం
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై నేరాలు తగ్గాయని ముఖ్యమంత్రి గణాంకాలతో సహా వివరించారు. మహిళలపై నేరాలు 4.84 శాతం మేర తగ్గాయి. వరకట్న మరణాలు 43 శాతం, మహిళల హత్యలు 15 శాతం తగ్గాయని ఆయన వివరించారు. అదేవిధంగా 59 శాతం హిళా ఆత్మహత్యలు, 17 శాతం సైబర్ వేధింపులు తగ్గాయని వెల్లడించారు. ఇక మహిళలపై నేరాలకు పాల్పడిన 343 మందికి శిక్షలు పడినట్లు సీఎం తెలిపారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని మరోసారి సీఎం హెచ్చరించారు. మహిళలపై నేరం జరిగితే కేవలం 8-10 నిమిషాల్లోపే ఘటనా స్థలికి చేరుకునేలా చర్యలు చేపట్టామని, ‘శక్తి టీమ్‌లను ఏర్పాటు చేసి రక్షణ పట్ల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ రాజకీయాలపైనా చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ‘పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్లి సినిమా డైలాగులు చెప్తారా? అంటూ సీఎం ప్రశ్నించారు. అలాగే, వైసీపీ కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కించేసి తిరిగి బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మృతుడి భార్యతో తన భర్త జగన్ కారు కింద చనిపోలేదు, పోలీసులు అంబులెన్సులో తీసుకెళ్లి చంపేశారని అసత్యాలు చెప్పించారని విమర్శించారు. మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్లి రోడ్డుపై మామిడికాయలు ట్రాక్టర్లతో తొక్కించారని, ఇటువంటి వింత చర్యలను తాను ఎప్పుడూ చూడలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
