Begin typing your search above and press return to search.

దొంగే దొంగా దొంగా అనే పరిస్థితి.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్

స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయ రచ్చకు కారణమవుతున్న టీటీడీ లడ్డూ కల్తీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Political Desk   |   21 Feb 2026 5:45 PM IST
దొంగే దొంగా దొంగా అనే పరిస్థితి.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
X

రాష్ట్ర రాజకీయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయ రచ్చకు కారణమవుతున్న టీటీడీ లడ్డూ కల్తీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షం వైసీపీ టార్గెట్ గా అనేక అంశాలను ప్రస్తావించిన సీఎం చంద్రబాబు ప్రజలు అంతా తనతో కలిసి నడవాలని కోరారు. గత పాలకులు గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం చేశారని, పరిశ్రమల్ని తరిమేశారని ధ్వజమెత్తారు. వెంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ చేసి, తిరిగి తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్ పై ఎదురుదాడి చేస్తున్నారని, ఇది చూస్తే దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉందని వ్యాఖ్యానించారు చంద్రబాబు.




పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించిన సీఎం చంద్రబాబు విపక్షం వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనమండలిలో శుక్రవారం విపక్ష సభ్యులు వెంకటేశ్వరస్వామి ఫొటోలను తీసుకువెళ్లడం, వాటిని విసిరేసి రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విపక్ష సభ్యులపై పరోక్ష విమర్శలు చేసిన చంద్రబాబు, వైసీపీ వారిని పాములతో పోల్చుతూ విమర్శలు గుప్పించారు. ‘‘శివుడి తలపై పాము ఉంటే ఏం చేయలేం. నేనైతే నమస్కరించి పామును బయటకు తెచ్చి ఏం చేయలో అది చేస్తాను’’ అంటూ వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యల్లో అంతరార్థం ఏంటన్న చర్చ జరుగుతోంది.




తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాక తిరుమల ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నానని సీఎం తెలిపారు. కానీ, విపక్షం చేసిన తప్పును ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వైసీపీ పేరు ఎత్తకుండానే పలు విమర్శలు చేశారు సీఎం చంద్రబాబు. ‘శ్రీ వేంకటేశ్వరస్వామి విషయం బయట పెట్టకూడదని రెండు రోజులు ఓపికగా ఉన్నానని, అయితే తిరిగి నింద తనపై వేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ‘‘పరామర్శలని చెప్పి వెళ్లి కొందరు వాళ్ల కార్ల కింద మనుషుల్ని చంపేస్తారు. బూతులు తిట్టిన వాళ్లను, రౌడీయిజం చేసిన వాళ్లను పరామర్శిస్తారు. కానీ వాళ్ల కారు కింద పడిన వారిని మాత్రం పరామర్శించరు అంటూ మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు చంద్రబాబు.




ఈ సందర్భంగా మదనపల్లెలో మృగాడు మరణాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. ‘‘మదనపల్లెలో గంజాయి సేవించి మానవ మృగంగా ప్రవర్తించాడు. ఆడబిడ్డల జోలికి వస్తే అది వారికి చివరి రోజు అవుతుందని నేను గతంలోనే హెచ్చరించాను. అలాంటి వారికి చట్టం ద్వారా ఉరి శిక్ష వేయిస్తాను. చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. ఆ భయంతోనే మృగాడు చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు’’ అంటూ మదనపల్లె సంఘటనపై వ్యాఖ్యలు చేశారు సీఎం. రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి వస్తే ఎవరినీ విడిచిపెట్టనని మరోసారి హెచ్చరించారు. ఇక ఇదే సమయంలో వివేకా హత్యపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకాను హత్య చేసి ఆ నేరం తనపై వేయాలని చూశారని, తాను నేరస్తుల గుండెల్లో నిద్రపోతాను కానీ నేరాలు చేయనని చంద్రబాబు స్పష్టం చేశారు.