నెల రోజుల్లో రెండోసారి.. సీఎం చంద్రబాబుతో పవన్ ప్రత్యేక భేటీ! మ్యాటరేంటో..?
ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఉండవిల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన పవన్ సీఎంతో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించకుంది.
By: Tupaki Political Desk | 3 March 2026 12:59 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఉండవిల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన పవన్ సీఎంతో ప్రత్యేకంగా సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించకుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం, త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఈ ఇద్దరు ముఖ్యనేతల భేటీని ప్రత్యేకంగా చూస్తున్నారు. అంతేకాకుండా కేవలం నెల రోజుల వ్యవధిలో సీఎం, డిప్యూటీ సీఎం ఏకాంతంగా చర్చలు జరపడం కూడా చర్చకు దారితీస్తోంది. గత నెల 4న చంద్రబాబు, పవన్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. సరిగ్గా నెలరోజులకు ఇద్దరు నేతలు మళ్లీ కలవడంపై పొలిటికల్ సర్కిల్స్ దృష్టిని ఆకర్షించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్ర మంత్రులు సమావేశం కావడం సహజమే అయినప్పటికీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ మాత్రం రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో నేనున్నా.. అంటూ పవన్ తన గళాన్ని విప్పుతూ చంద్రబాబుకు రక్షణగా నిలుస్తున్నారు. దీంతో ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తన బదులుగా ప్రభుత్వం తరఫున మాట్లాడే అవకాశాన్ని ఎక్కువగా పవన్ కే అప్పగిస్తున్నారు సీఎం.
దీంతో చంద్రబాబు, పవన్ భేటీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల విరామం తర్వాత బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే సభలో తిరుమల లడ్డూ కల్తీపై చర్చ జరిగింది. మండలిలో విపక్షం ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతోంది. ఇదే సమయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇంతవరకు మండలి సమావేశాలకి వెళ్లలేదు. అక్కడ మంత్రి లోకేశ్ అన్నీతానై వ్యవహిస్తున్నారు. మండలిలో విపక్షం బలంగా ఉండటంతో లోకేశ్ ఒక్కరిపైనే భారం పడుతోంది. బుధవారం మండలిలో లడ్డూ అంశంపై చర్చ జరగనుండటంతో పవన్ కూడా మండలికి వెళ్లేలా ప్లాన్ జరుగుతోందని అంటున్నారు. మండలిలో ఏ విధంగా మాట్లాడాలనే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు పవన్ సమావేశమయ్యారని అంటున్నారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుల ఎంపిక, స్థానిక ఎన్నికలపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
అయితే పవన్, చంద్రబాబు భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ పరిపాలన వ్యవహారాలు చర్చించేందుకే ముఖ్యనేతలు ఇద్దరు సమావేశమయ్యారని అంటున్నారు. పవన్ పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ శాఖలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబుతో చర్చించారని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా మంగళవారం ప్రారంభించిన హనుమాన్ పథకంపైనా సీఎం చంద్రబాబుకు వివరాలు తెలియజేశారని అంటున్నారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, నిధుల వినియోగం, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి నిధుల కేటాయింపు, నియోజకవర్గాల వారీగా జరిగిన కేటాయింపులు తదితర అంశాలపై చంద్రబాబుతో పవన్ చర్చించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల పనులను సీఎం దృష్టికి తీసుకువెళ్లారని, ఈ తరహా డ్రెయిన్స్ ను అన్ని పంచాయతీల్లో నిర్మించాలని పవన్ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు దీనివల్ల పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయవచ్చని పవన్ వివరించారని అంటున్నారు.
