'క్లౌడ్ బరస్ట్' అంటే ఏంటి?.. అవి ఎక్కడ సంభవిస్తాయి?
అయితే.. దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు, వరదలకు 'క్లౌడ్ బరస్ట్' లే కారణమని అంటున్నారు!
By: Tupaki Desk | 26 Jun 2025 8:15 AM ISTసాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే కుంభవృష్టి వర్షాలు, ఆకస్మిక వరదలు.. వాటి వల్ల కొండచరియలు విరిగిపడిపోవడం, జనావాసాలు మునిగిపోవడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో.. ఒక్కసారిగా పరిస్థితి మొత్తం జలమయం అయిపోతుంది. ఆ సమయంలో... ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ ప్రతికూల వాతావరణ స్థితిని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
అయితే.. దేశంలో పలుచోట్ల భారీ వర్షాలు, వరదలకు 'క్లౌడ్ బరస్ట్' లే కారణమని అంటున్నారు! గతంలో... భారీ వర్షాల వెనుక విదేశీయులు క్లౌడ్ బరస్ట్ కుట్రకు పాల్పడి ఉండవచ్చని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు ఈ 'క్లౌడ్ బరస్ట్' అంటే ఏమిటీ..? అది ఎందుకు సంభవిస్తుంది..? మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దామ్..!
భారత వాతావరణ శాఖ ప్రకారం.. సాధారణంగా అతి స్వల్ప సమయంలో అతి భారీ వర్షాలకు దారితీయడాన్నే 'క్లౌడ్ బరస్ట్' అని అంటారు. ఇందులో.. 20 నుంచి 30చ.కి.మీ పరిధిలో గంటకు 10 సెం.మీ వర్షపాతం నమోదవుతుంది. ఈ క్రమంలో.. ఒక్కోసారి ఊహించని స్థాయిలో కురిసే ఈ భారీ వర్షాలు ఆకస్మిక వరదలకు దారితీస్తాయి. ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంటాయి!
ఇంత ప్రమాదకరమైన క్లౌడ్ బరస్ట్ ఎప్పుడు సంభవిస్తుందనేది మాత్రం కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని.. తక్కువ పరిధిలో కుంభవృష్టి జరిగే అవకాశం ఉండటంతో అవి ఏ ప్రాంతంలో సంభవిస్తాయనే విషయాన్ని కచ్చితంగా ఎవరూ చెప్పలేరని అంటున్నారు. అయితే.. అవి ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లోనే చోటుచేసుకుంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ముఖ్యంగా వర్షాకాలం సమయంలో జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో వాతావరణ మార్పుల వల్ల ఇవి అకస్మాత్తుగా సంభవిస్తుంటాయి. ఈ క్రమంలో... భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీసే ఈ క్లౌడ్ బరస్ట్ లు భారత్ లో చోటుచేసుకుంటూనే ఉన్నాయి. కేవలం హిమాలయ ప్రాంతాల్లోనే ఏటా పదుల సంఖ్యలో ఇవి సంభవిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
