వందల పక్షి జాతుల కనుమరుగుపై తెరపైకి షాకింగ్ రిపోర్ట్!
ఇదే సమయంలో... అరుదైన, అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంరక్షణ ఇప్పుడు తక్షణావసరం అని స్టీవార్ట్ అన్నారు.
By: Tupaki Desk | 3 July 2025 7:00 AM ISTమనిషి మనుగడకు ఈ ప్రకృతి, ఇందులోని తోటి ప్రాణులు ఎంతో సహకరిస్తూ, సహాయపడుతుంటే.. మనిషి చేస్తున్న పనులు మాత్రం అటు ప్రకృతుని నాశనం చేస్తూ, తోటి ప్రాణుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ క్రమంలో 500కు పైగా పక్షిజాతులు త్వరగా అంతరించిపోయే అవకాశం ఉందని తాజా అధ్యయనం ఒకటి షాకింగ్ విషయాలు వెల్లడించింది.
అవును... వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు పక్షులపై పడ్డాయని.. ఫలితంగా, అన్నెంపున్నెం ఎరుగని పక్షుల మనుగడకు పరోక్షంగా మానవుడు చేజేతులా చంపేస్తున్నాడన్న వాస్తవాలు తాజాగా వెలుగుచూశాయి. తాజాగా ఇంగ్లండ్ లోని బెర్క్ షైర్ లోగల యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఈ మేరకు పలు షాకింగ్ విషయాలు వెల్లడించింది.
ఇందులో భాగంగా... వందలాది పక్షిజాతులు వచ్చే వందేళ్లలో కనుమరుగవడం ఖాయమని పరిశోధకులు తేల్చిచెప్పారు. దీనికి కారణం... శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఇష్టారీతిన సాగుతున్న మానవ కార్యకలాపాలు, పరిశ్రమల కాలుష్యం, అడవుల నరికివేత అని చెబుతున్నారు. ఈ కారణాల వల్ల భూగోళం మండిపోతూ, పక్షిజాతుల మనుగడకు మంటపెడుతుంది.
ఈ క్రమంలో.. సుమారు 1,500 సంవత్సరం నుంచి చూస్తే.. నాడు అంతరించిపోయిన పక్షిజాతుల కంటే ఇప్పుడు వాతావరణ మార్పులు వల్ల అంతరించిపోతున్న పక్షిజాతుల సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు దీనికి సంబంధించిన పరిశోధనా వివరాలు 'నేచర్ ఎకోలజీ అండ్ ఎవల్యూషన్' జర్నల్ లో ప్రచురితమయ్యాయి.
ఈ సందర్భంగా స్పందించిన పరిశోధనలోని కీలక రచయిత కెర్రీ స్టీవార్ట్... అడవుల నరికివేత, వేటను ఆపడంతోపాటు వాతావరణ మార్పులకు అడ్డుకట్టవేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని.. ఇప్పుడు మరింతగా శ్రమించాల్సి ఉందని.. ప్రత్యేకంగా ఈ జాతి పక్షులను పెంచి వీటి సంతతిని వృద్ధి చేయాలని.. బ్రీడింగ్ విధానాలను అమలుచేయాలని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో... అరుదైన, అంతర్థానమవుతున్న పక్షిజాతుల సంరక్షణ ఇప్పుడు తక్షణావసరం అని స్టీవార్ట్ అన్నారు. ఈ సందర్భంగా... అడవి బాగుండాలంటే పక్షులు ఉండాలని.. పక్షులు అడవికి ఎంతో మేలుచేస్తాయని.. వందల వేల రకాల చెట్ల పళ్లను తిని గింజలను విస్తారంగా పడేస్తాయని.. తద్వారా అడవి అంతటా అన్ని రకాల మొక్కలు పుట్టుకొస్తాయని తెలిపారు.
అదేవిధంగా.. ప్రతీరోజూ లెక్కలేనన్ని కీటకాలను తిని.. పురుగుల అతి బెడదను నివారిస్తాయని.. చిన్న పక్షులు చెట్ల పరపరాగ సంపర్కానికీ దోహదపడి పూతకు కారణమవుతాయని తెలిపారు. ఇదే సమయంలో... అడవిలో ఆహారచక్రం సవ్యంగా ముందుకు సాగాలన్నా పక్షులు ఉండాల్సిందేనని.. అవి లేని నష్టాన్ని పూడ్చడం అసాధ్యమని పరిశోధనలో మరో సీనియర్ రచయిత్రి మాన్యులా గోంజాల్వెజ్ సారెజ్ చెప్పారు.
