Begin typing your search above and press return to search.

ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫౌండర్ అభిజిత్ కు షాక్

యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి భారీ షాక్ తగిలింది.

By:  A.N.Kumar   |   23 May 2026 3:16 PM IST
ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఫౌండర్ అభిజిత్ కు షాక్
X

యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి భారీ షాక్ తగిలింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పాటు పార్టీ అధికారిక ఇన్‌స్టా పేజీ కూడా హ్యాకర్ల బారిన పడినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రకటించడంతో అభిమానులు, ఫాలోవర్లలో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పూర్తిగా నియంత్రణ కోల్పోయామని అభిజిత్ పేర్కొన్నారు.

అభిజిత్ దిప్కే వెల్లడించిన వివరాల ప్రకారం.. మొదట తన పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పనిచేయడం ఆగిపోయిందని గుర్తించారు. అనంతరం పార్టీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా హ్యాక్‌కు గురైనట్లు తెలిసిందన్నారు. అకౌంట్‌లను తిరిగి రికవర్ చేసుకునేందుకు మెటా అందించే రికవరీ ప్రాసెస్‌ను పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ప్రతి సారి “సెక్యూరిటీ కారణాల వల్ల ఖాతా లాక్ చేయబడింది” అనే మెసేజ్ మాత్రమే వస్తోందని తెలిపారు. ఐడెంటిటీ వెరిఫికేషన్ పూర్తి చేసి కొత్త పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలని సూచనలు వస్తున్నప్పటికీ చివరికి ఎర్రర్ చూపిస్తూ ప్రాసెస్ నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన ఖాతాలే కాకుండా బ్యాకప్ కోసం సృష్టించిన మరో పార్టీ అకౌంట్‌ను కూడా టార్గెట్ చేశారని అభిజిత్ ఆరోపించారు. కొంతసేపు ఆ బ్యాకప్ పేజీ పూర్తిగా డిలీట్ అయినట్లు కనిపించిందని.. ఇది సాధారణ హ్యాకింగ్ కాదని, తమను అణచివేయడానికి జరుగుతున్న వ్యవస్థీకృత డిజిటల్ దాడి అని మండిపడ్డారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పైనా తమకు యాక్సెస్ లేదని స్పష్టం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఫాలోవర్లను అప్రమత్తం చేస్తూ కీలక హెచ్చరిక జారీ చేశారు అభిజిత్. ఇకపై హ్యాక్ అయిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి వచ్చే పోస్టులు, స్టోరీలు లేదా సందేశాలను ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధికారిక ప్రకటనలుగా పరిగణించవద్దని కోరారు. హ్యాకర్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇది మొదటిసారి కాదని కూడా అభిజిత్ గుర్తు చేశారు. గతంలో పార్టీకి చెందిన ప్రధాన ‘ఎక్స్’ అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేశారని, అయినప్పటికీ తాము వెనక్కి తగ్గకుండా ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ పేరుతో కొత్త ఖాతాను ప్రారంభించి మళ్లీ కార్యకలాపాలు కొనసాగించామని చెప్పారు. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను టార్గెట్ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో సెటైరికల్ కంటెంట్, రాజకీయ వ్యంగ్యాలు, యువతకు కనెక్ట్ అయ్యే పోస్టులతో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా యువతలో ఈ పేజీకి ప్రత్యేక ఆదరణ ఉంది. అలాంటి సమయంలో ప్రధాన సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, అభిమానులు అకౌంట్లు త్వరగా రికవర్ కావాలని కోరుకుంటున్నారు.