Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల్లోకి రాకుండా.. 'కాక్రోచ్' కొత్త వ్యూహం!

వైద్య విద్యా ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంపై ఉద్య‌మించి..స‌క్సెస్ కొట్టిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) భ‌విష్య‌త్తు వ్యూహాల‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించింది.

By:  Garuda Media   |   3 Aug 2026 3:42 PM IST
రాజ‌కీయాల్లోకి రాకుండా.. కాక్రోచ్ కొత్త వ్యూహం!
X

వైద్య విద్యా ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంపై ఉద్య‌మించి..స‌క్సెస్ కొట్టిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) భ‌విష్య‌త్తు వ్యూహాల‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించింది. సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే.. ఈ సంస్థ‌ను మ‌రింత ముందుకు తీసుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. అది రాజ‌కీయంగా కాద‌ని ఆయ‌న ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి గ‌తంలో ఆమ్ ఆద్మీపార్టీ కూడా ఇలానే ఉద్య‌మపార్టీగా అవ‌త‌రించింది. అవినీతి, లంచాలు లేని వ్య‌వ‌స్థ కోసం ఉద్య‌మించిన ఆమ్ ఆద్మీ.. లోక్‌పాల్ బిల్లు తీసుకురావాల‌ని కృషి చేసింది. దీనిలో స‌క్సెస్ కూడాఅయింది.

అయితే.. అనంత‌ర కాలంలో కేజ్రీవాల్ దీనిని రాజ‌కీయ పార్టీగా మార్చారు. ఢిల్లీలో అధికారాన్నికూడా ద‌క్కించుకున్నారు. దీనికి భిన్నంగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఏంటి? ఎలా ముందుకు సాగుతార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. జాతీయ రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌ను బ‌ట్టి.. ప్ర‌ధానంగా 3 అంశాల‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ దృష్టి పెట్ట‌నుంద‌ని తెలుస్తోంది.

1) అవినీతి: కేంద్ర ప్ర‌భుత్వ స్థాయిలో అవినీతిని ప్ర‌శ్నించ‌డం అనేది కాక్రోచ్ అజెండాలో చేరిన‌ట్టు తెలుస్తోంది. త‌ద్వారా.. ఈ ఉద్య‌మాన్ని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించి.. ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకురానున్న‌ట్టు స‌మాచారం.

2) కార్పొరేట్ -పాలిటిక్స్‌: దేశ‌వ్యాప్తంగా సంప‌ద కొంద‌రు కార్పొరేట్ పారిశ్రామిక వేత్త‌ల ద‌గ్గ‌రే మూలుగుతున్న నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారంపై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఇప్ప‌టికే ఒక ప్ర‌క‌ట‌న చేసింది. దేశ‌వ్యాప్తంగా 140 కోట్ల మంది ప్ర‌జ‌లు ఉంటే.. కేవ‌లం 40 మంది బ‌డా పారిశ్రామిక వేత్త‌ల ద‌గ్గ‌రే ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఉండ‌డం.. కేంద్ర ప్ర‌భుత్వం వారికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించ‌డం .. వంటివాటిని ప్ర‌శ్నిస్తోంది. సో.. దీనిని కూడా ఒక అస్త్రంగా చేసుకుని ఉద్య‌మించ‌నుంది. అలాగే..బ్యాంకు రుణాల విష‌యంలో కేంద్రం అవ‌లంభిస్తున్న తీరును కూడా ప్ర‌శ్నించ‌నుంది. పేద‌ల‌కు 10 రూపాయ‌లు అప్పు ఇవ్వ‌ని బ్యాంకులు.. బ‌డా బాబుల‌కు ల‌క్ష‌ల కోట్లు ఇచ్చి.. త‌ర్వాత‌.. మునిగిపోగా కేంద్ర వాటిని మాఫీ చేయ‌డాన్ని కాక్రోచ్ ప్ర‌శ్నించ‌నుంది.

3) విద్య‌-ఉద్యోగాలు: దేశంలో నిరుద్యోగం 2030 నాటికి 50 శాతానికి మించ‌నుంద‌న్న అంచ‌నాల నేప‌థ్యంలోయువ‌తకు ఉద్యోగాలు, ఉపాధిక‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇచ్చేలా కేంద్రంపై మ‌రింత ఒత్తిడి తీసుకురావాల‌ని కాక్రోచ్ భావిస్తోంది. ఇలా.. మూడు అంశాల‌ను అజెండాగా చేసుకుని ముందుకు సాగొచ్చ‌ని స‌మాచారం. ఇదిలావుంటే, మ‌రో రెండు రోజుల్లో కాక్రోచ్ పార్టీ కీల‌క భేటీ నిర్వ‌హించి భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించ‌నుంది.