‘కాక్రోచ్’ ఫౌండర్ చెంప పగుల కొట్టిన నిందితుడు ఏమన్నాడో తెలుసా?
తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన ఒక ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై బహిరంగంగా జరిగిన దాడి, దానికి నిందితుడు ఇచ్చిన కవరింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
By: A.N.Kumar | 15 Jun 2026 9:50 PM ISTరాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌లు సర్వసాధారణం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో నచ్చని నాయకులపై భౌతిక దాడులకు తెగబడటం ఒక ప్రమాదకరమైన ట్రెండ్‌గా మారుతోంది. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగిన ఒక ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై బహిరంగంగా జరిగిన దాడి, దానికి నిందితుడు ఇచ్చిన కవరింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హైడ్రామా మధ్య సభా ప్రాంగణంలోకి ఎంట్రీ
దేశంలో తీవ్ర దుమారం రేపుతున్న నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, అలాగే నిరుద్యోగ సమస్యలపై నిరసన తెలిపేందుకు కాక్రోచ్ జనతా పార్టీ జైపూర్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సభకు హాజరైన పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేకు ఆయన మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. కార్యకర్తల భుజాలపై కూర్చుని ఆయన సభా ప్రాంగణంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ ఉత్సాహం ఎంతోసేపు నిలవలేదు. అభిమానుల కోలాహలం మధ్య ఉన్నట్టుండి కొందరు వ్యక్తులు గుంపులోంచి దూసుకొచ్చారు. ఊహించని విధంగా అభిజిత్ దీప్కేపై దాడి చేసి, చెంపలపై బలంగా కొట్టారు. ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
'దేశభక్తి' ముసుగులో దాడి.. నిందితుడి వింత వాదన
దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులకు నిందితుడు చెప్పిన సమాధానం విస్తుపోయేలా చేసింది. తనపై ఎలాంటి రాజకీయ ముద్ర పడకుండా ఉండేందుకు అతడు సరికొత్త 'దేశభక్తి' కార్డును బయటకు తీశాడు. "నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. నేను స్వచ్ఛమైన జాతీయవాదిని. అభిజిత్ దీప్కే తన వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. అందుకే ఒక దేశభక్తుడిగా ఆయనకు గుణపాఠం చెప్పడానికే చెంపదెబ్బ కొట్టాను" అని నిందితుడు స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
అంతేకాకుండా కాక్రోచ్ జనతా పార్టీ వెనుక "జిహాదీ భావజాలం" ఉందంటూ ఆరోపణలు చేశాడు. దేశభక్తి సర్టిఫికెట్ తో ఎవరినైనా బహిరంగంగా కొట్టే హక్కు వచ్చేస్తుందా? అనే ప్రశ్నలు విజ్ఞుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. "ఇప్పుడు దేశంలో ప్రతి భౌతిక దాడికి ఒక సిద్ధాంతం, ప్రతి చెంపదెబ్బకు ఒక దేశభక్తి వివరణ ఇచ్చుకునే కొత్త ట్రెండ్ నడుస్తోంది" అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు దాడి జరిగినప్పటికీ అభిజిత్ దీప్కే సంయమనం పాటించారు. తన మద్దతుదారులను శాంతింపజేస్తూ.. "ఎంత మంది దాడులు చేసినా మనం హింసకు పాల్పడకూడదు. పిరికిపందలు మాత్రమే ఇలాంటి దాడులు చేస్తారు" అని పేర్కొంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ప్రజాస్వామ్యానికి చేటు
ఈ ఘటన ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు, వాదన, చర్చల కంటే కొందరు తమ అభిప్రాయాలను చేతుల ద్వారా వ్యక్తపరచడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే, రేపు ఎన్నికల కమిషన్ కూడా బ్యాలెట్ పేపర్లు, ఈవీఎంల పక్కన బాక్సింగ్ గ్లౌజులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భావప్రకటన స్వేచ్ఛ అంటే భౌతిక దాడులు చేయడం కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దేశభక్తి అని రంగు పూసే ఇలాంటి సంస్కృతిని సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాక్రోచ్ పార్టీ ఎలాంటిదైనా? దాని ఉద్దేశం ఏదైనా కానీ ఇలా భౌతిక దాడులకు పాల్పడడం సరైంది కాదు.. కౌంటర్ గా బలంగా నిలబడితే చాలు. అదే చేయాలి అందరూ..
