Begin typing your search above and press return to search.

మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు సీరియస్... మైతేయ్ లకు షాక్!

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని అన్నారు.

By:  Tupaki Desk   |   31 July 2023 1:51 PM GMT
మణిపూర్  అల్లర్లపై సుప్రీంకోర్టు సీరియస్... మైతేయ్  లకు షాక్!
X

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మణిపూర్ లో మహిళలను నగ్నంగా నడిపించిన వీడియోకి సంబంధించిన విషయం గురించి తెలిసిందే. ఈ వీడియో వెలుగులోకి రాగానే విపక్షాలకంటే.. సామాన్యులకంటే.. మీడియా కంటే.. ఎక్కువగా సుప్రీం కోర్టు సీరియస్ అయ్యిందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంలో వాదనలు స్టార్ట్ అయ్యాయి.

అవును... మణిపూర్ లో ఇద్దరు మహిళల నగ్న ఊరేగింపు సంఘటనపై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వీడియో బయటకు వచ్చే వరకు ఏం చేస్తున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ సందర్భంగా జరిగిన వాదోపవాదనలు ఎలా ఉన్నాయి.. సుప్రీం ఏస్థాయిలో రియాక్ట్ అయ్యిందని అనేది ఇప్పుడు చూద్దాం.

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన సంఘటనపై సుప్రీంకోర్టు కేంద్రంపై సీరియస్ అయ్యింది. మే 3న అల్లర్లు జరిగితే ఇప్పటివరకు ఎన్ని ఎఫ్.ఐ.ఆర్.లు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వీడియో బయటకు వచ్చేంతవరకు ఏం చేస్తున్నారని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు.. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని అన్నారు.

ఈ కేసులో బాధిత మహిళల తరపున సినియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈ కేసులో సీబీఐ విచార‌ణ‌ను బాధిత మ‌హిళ‌లు వ్యతిరేకిస్తున్నట్లు వేరే ఏ కోర్టులోనూ ఈ కేసును బ‌దిలీ చేయ‌వద్దంటున్నట్లు ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు.

ఇదే సమయంలో బాధితమహిళల్లోని ఒకరి సోదరుడు, తండ్రి మృతి చెందారని.. ఇంతవరకు ఆ మృతదేహాలను కుటుంబానికి అప్పగించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా... సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించేంత వరకు కేసులో కదలిక రాలేదని కపిల్ సిబాల్ కీలక విషయాలు వెల్లడించారు!

ఇక ప్రభుత్వం తరుపున కేసును వాదించిన సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా... కేసును అస్సాం కు బదిలీ చేయమని ప్రభుత్వం కోరలేదని.. విచారణ మణిపూర్ వెలుపల జరిగితే బాగుంటుందని మాత్రమే కోరిందని తెలిపారు. ఇదే సమయంలో మణిపూర్ లో ఇప్పటి వ‌ర‌కు 595 ఎఫ్.ఐ.ఆర్ లు న‌మోదు అయిన‌ట్లు సీనియ‌ర్ న్యాయ‌వాది ఇందిరా జైసింగ్ తెలిపారు.

మైతేయ్ ల పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు:

మరోపక్క... మణిపూర్ హింస కేసులో మైతేయ్ లకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది! మైతేయ్ లు దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం తిరస్కరించింది. మణిపూర్ లో జరుగుతున్న హింస జాతి హింస కాదని.. మయన్మార్ నుంచి వస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణాకు సంబంధించిందని పేర్కొంటూ... మైతేయ్ కమ్యూనిటీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

అయితే ఈ పిటిషన్ ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సమయంలో... ఒక తెగను ఉగ్రవాదులుగా సంభోదించడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. దీంతో మైతేయ్ కమ్యూనిటీ సంస్థ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. ఈ సందర్భంగా... వాస్తవాలను జోడించి పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సీజేఐ సూచించడం గమనార్హం!