సీజేఐకి అవమానం.. అధికారుల తీరుపై గవాయ్ తీవ్ర అసహనం!
భారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తికి మహారాష్ట్రలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో జరిగిన సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
By: Tupaki Desk | 18 May 2025 11:00 PM ISTభారత న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తికి మహారాష్ట్రలో జరిగిన ఒక సన్మాన కార్యక్రమంలో జరిగిన సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, తన స్వరాష్ట్రమైన మహారాష్ట్రలో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ముంబై పోలీస్ కమిషనర్ వంటి అత్యున్నత స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై తీవ్రంగా స్పందించారు. న్యాయవ్యవస్థకు, ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తికి ఇలాంటి అవమానం జరగడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తన స్వరాష్ట్రానికి మొదటిసారి ప్రధాన న్యాయమూర్తి హోదాలో అడుగుపెడితే, ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తారా అని ఆయన ప్రశ్నించారు.
ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ పాల్గొన్నారు. అనంతరం, బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక చైత్య భూమిని సందర్శించారు. మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముంబై పోలీస్ కమిషనర్ వంటి కీలక అధికారులు హాజరు కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
న్యాయమూర్తులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తే, సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 142 గురించి చర్చలు ప్రారంభమవుతాయని, కానీ మూడు రాజ్యాంగ వ్యవస్థలు పరస్పరం గౌరవించుకోవాలని, సహకరించుకోవాలని జస్టిస్ గవాయ్ సూచించారు. ప్రజాస్వామ్యానికి మూడు స్తంభాలైన న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వ్యవస్థ సమానమని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రాజ్యాంగ సంస్థ ఇతర సంస్థలకు ప్రతిస్పందించాలని ఆయన అన్నారు.
మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు మొదటిసారి స్వరాష్ట్రాన్ని సందర్శించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లేదా ముంబై పోలీస్ కమిషనర్ హాజరు కాకపోవడం సముచితం కాదని భావిస్తే, వారు దాని గురించి ఆలోచించాలని సూచించారు. ప్రోటోకాల్‌లు కొత్తవి కావని, ఇది ఒక రాజ్యాంగ సంస్థ మరొక సంస్థకు ఇచ్చే గౌరవానికి సంబంధించిన ప్రశ్న అని ఆయన అన్నారు. ఇవి చిన్న విషయాలుగా అనిపించవచ్చని, కానీ ప్రజలకు వాటి గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు.
