Begin typing your search above and press return to search.

'నిజాం భారీ ఆఫర్ కు నో చెప్పిన అంబేడ్కర్'.. ఎవరు చెప్పారంటే?

హైదరాబాద్ మహానగరంలో జరిగే రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రావటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 July 2025 9:27 AM IST
నిజాం భారీ ఆఫర్ కు నో చెప్పిన అంబేడ్కర్.. ఎవరు చెప్పారంటే?
X

హైదరాబాద్ మహానగరంలో జరిగే రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రావటం తెలిసిందే. ఇందులో ఒక కార్యక్రమం నల్సార్ వర్సిటీలో జరగ్గా.. రెండో ప్రోగ్రాం ఉస్మానియా వర్సిటీలో జరిగింది. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సులో ప్రధాన న్యాయమూర్తి పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే ఈ అంశంపై తాను పలు దేశాల్లో మాట్లాడినట్లు చెప్పిన ఆయన.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా రాజ్యాంగాన్ని తయారు చేశారన్నారు.

రాజ్యాంగ నిరమాణంలో అంబేడ్కర్ పాత్ర వెలకట్టలేనిదని.. ప్రపంచ వ్యాప్తంగా ఆయన గొప్పదనాన్ని గుర్తించారన్న ఆయన.. గతంలో జరిగిన ఒక అంశాన్ని ప్రస్తావించారు. 1953లో ఇదే ఉస్మానియా వర్సిటీ అంబేడ్కర్ కు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చారని.. అలాంటి వర్సిటీలో ప్రసంగించే అవకాశం తనకు దక్కటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో తెలుగు ప్రాంతానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహా మాట్లాడుతూ మరో ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ మహానగరం తన సొంత నగరమని.. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తాను చదువుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తన సొంత నగరానికి.. తాను చదువుకున్న వర్సిటీకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో కలిసి రావటం.. ఈ ప్రోగ్రాంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కు హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సామాజిక న్యాయ పోరాటంలో భాగంగా అంబేడ్కర్ భాగ్య నగరాన్ని సందర్శించినట్లు చెప్పారు.

అంతేకాదు.. అంబేడ్కర్ ను నిజాం నవాబు కలిసి.. నాటి హైదరాబాద్ రాజ్య హైకోర్టుప్రధాన న్యాయమూర్తిగా ఉండాలని కోరారని.. అయితే.. ఆ ఆఫర్ ను అంబేడ్కర్ సున్నితంగా తిరస్కరించారన్నారు. అంబేడ్కర్ తన ఆత్మకథలో హైదరాబాద్ ఉద్యమాలు.. సామాజిక న్యాయంతో సహా పలు విషయాల్ని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్ అంబేడ్కర్ కు అత్యంత సన్నిహితుడన్న విషయాన్ని వెల్లడించారు.